Sri Ganesh: నాపై దాడికి యత్నించింది మా పార్టీ వారే: ఎమ్మెల్యే శ్రీగణేశ్‌

Sri Ganesh Alleges Attack Attempt by Party Members
  • బోనాల ఊరేగింపు కార్యక్రమానికి వెళుతుండగా ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై దాడికి య‌త్నం
  • ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే 
  • ఉద్దేశపూర్వ‌కంగానే త‌న‌పై దాడికి య‌త్నించినట్టుందని ఎమ్మెల్యే అనుమానం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై నిన్న రాత్రి కొందరు దుండగులు దాడికి ప్రయత్నించిన విష‌యం తెలిసిందే. మాణికేశ్వర్ నగర్ (వడ్డెర బస్తీ)లో బోనాల సందర్భంగా ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళుతుండగా, సుమారు 20 మంది దుండగులు దాడికి యత్నించారు. అద్దాలు దించాలంటూ కారును వెంబ‌డించారు. ఈ మేరకు ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

అయితే, ఈ ఘ‌ట‌న‌పై తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న పార్టీకి చెందిన వారే దాడికి య‌త్నించార‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉద్దేశ పూర్వ‌కంగానే త‌న‌పై దాడికి య‌త్నించినట్టుందని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో త‌మ‌ పార్టీకి చెందిన ఓ నేత త‌న‌ను టార్గెట్ చేశార‌న్నారు. ఆయన వ్యవహారశైలిపై గత శుక్రవారం డీసీపీకి కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

ఆ వెంటనే త‌న‌ సన్నిహితులను భయబ్రాంతులకు గురి చేశార‌ని, నిన్న త‌న‌పై దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారేన‌ని చెప్పారు. అందులో ముగ్గురిని గుర్తించామ‌ని, పోలీసులకు సమాచారం ఇచ్చామ‌ని తెలిపారు. అయితే, ఇది పార్టీ పెద్దలకు చెప్పాల్సినంత‌ పెద్ద విష‌యమేం కాదని ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. 
Sri Ganesh
Secunderabad Cantonment
Congress MLA
Attack Attempt
Telangana Politics
OU Police Station
Manikeshwar Nagar
Bonala Festival
Political Conspiracy

More Telugu News