పనిచేయడం మాత్రమే తెలుసు ప్రచారం చేసుకోవడం తెలియదు: పవన్ కల్యాణ్
- హరిహర వీరమల్లు టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్
- సినిమాపరంగా జీవితంలో మొదటిసారి మీడియాతో మాట్లాడుతున్నా..
- భారత సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఏఎం రత్నానిదే
- క్లైమాక్స్ ఫైట్ కోసం 55 రోజులు షూట్ చేయాల్సి వచ్చిందన్న పవన్ కల్యాణ్
నిజానికి ఈ రోజు సాయంత్రం హరిహర వీరమల్లు ఆడియో ఫంక్షన్ ఉందని, అయినప్పటికీ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏఎం రత్నం గారి కోసమే పెట్టామని పవన్ వివరించారు. సినిమా బతకాలని చాలా తపన పడే వ్యక్తి, తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి అని ఏఎం రత్నంను కొనియాడారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో తపనపడ్డారని తెలిపారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొందని, షూటింగ్ చాలా ఆలస్యమైందని తెలిపారు. అయినా కూడా ఈ సినిమా చేయడానికి ఏఎం రత్నం పడిన తపనే కారణమని పవన్ వివరించారు.
ఆయన తపన చూశాక ఈ సినిమాకు తాను ఎంత ఇవ్వగలనో అంత ఇచ్చానని, ఇందులో బెస్ట్ ఫర్మార్మెన్స్ చూపించానని పేర్కొన్నారు. ఖుషి సినిమా నుంచి ఏఎం రత్నంను దగ్గరగా పరిశీలిస్తున్నానని, కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా ఇండస్ట్రీని బతికించేందుకు ఆయన ఎంతగానో తాపత్రయపడ్డారని పవన్ కల్యాణ్ వివరించారు. కాగా, ఈ సినిమా కోసం తాను ఎక్కువగా సమయం ఇవ్వలేనని చెప్పినా కష్టపడి షూటింగ్ పూర్తిచేశారని చిత్ర బృందాన్ని పవన్ కొనియాడారు. క్లైమాక్స్ కోసం ఏకంగా 55 రోజులు షూటింగ్ చేశామని తెలిపారు. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ ఫైట్ కోసం ఉపయోగపడిందని వివరించారు.