Gaza: ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 90 మందికి పైగా మృత్యువాత

Gaza Food Distribution Center Shooting Kills Over 90
  • ఆహార పదార్థాల కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన గాజా పౌరులు
  • అమాయకులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపిందన్న సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ
  • ఇజ్రాయెల్ తో యుద్ధం కారణంగా గాజాలో ఆకలి కేకలు
హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం కారణంగా గాజా మరుభూమిగా మారిపోయింది. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడా గాజా పౌరులు దయనీయ పరిస్థితిల్లో జీవిస్తున్నారు. తిండి నీరు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, అటు హమాస్ ఉగ్రవాదుల ఎదురుకాల్పుల మధ్య వారు నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో గాజా పౌరుల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు గాజాలో మానవతా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఈ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ సైన్యం కాపలా కాస్తోంది.

ఆకలి తట్టుకోలేక జనం ఈ కేంద్రాల వద్దకు పోటెత్తుతున్నారు. వారిని నియంత్రించేందుకు సైనికులు కాల్పులు జరుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా నార్త్ గాజాలోని ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద గుమిగూడిన జనాలను నియంత్రించేందుకు ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపిందని, ఈ ఘటనలో ఏకంగా 80 మంది మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ఆరోపించింది. మరో రెండు కేంద్రాల వద్ద 10 మందికి పైగా గాజా పౌరులు మృత్యువాత పడ్డారని తెలిపింది. ఆకలి తట్టుకోలేక సాయం కోసం వచ్చిన అమాయకులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తూటాల వర్షం కురిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా, గాజాలో పౌరుల దీనస్థితికి అద్దం పట్టే సంఘటన గురించి ఐక్యరాజ్య సమితి అధికారులు వివరిస్తూ.. ఇటీవల గాజా సిటీలోకి ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం కింద 25 ట్రక్కుల నిండా ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను పంపించిందని చెప్పారు. సరిహద్దుల్లో తనిఖీల తర్వాత ట్రక్కులు ఇలా గాజా సిటీలోకి ప్రవేశించాయో లేదో వందలాది మంది పౌరులు వాటిని చుట్టుముట్టారని తెలిపారు. కాగా, ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పుల ఘటనపై ఐడీఎఫ్ వివరణ ఇస్తూ.. కేంద్రం వద్దకు జనం భారీగా రావడంతో అక్కడున్న సిబ్బందికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని పేర్కొంది. దీనిని తప్పించేందుకు సైనికులు హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపారని వివరణ ఇచ్చింది.
Gaza
Gaza Strip
Israel
IDF
World Food Programme
food distribution
humanitarian aid
civilian casualties
Hamas
famine

More Telugu News