వివాహిత ఆత్మహత్య .. భర్త, అత్తమామలపై కేసు నమోదు

  • చిన్నారి కళ్లెదుటే ఉరివేసుకున్న ఆత్మహత్యకు పాల్పడిన అశ్విని
  • భర్త, అత్తమామల వేధింపులే కారణమని పోలీసులకు తల్లి ఫిర్యాదు
  • దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులకు ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఈ వివరాలను దుండిగల్ ఎస్సై రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు.

పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన అశ్విని (25)కి మల్లంపేటకు చెందిన సాయిరామ్‌తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి మూడేళ్ల పాప కూడా ఉంది. వివాహ సమయంలో అశ్విని తల్లిదండ్రులు రూ. 12 లక్షలు కట్నంగా ఇస్తామని అంగీకరించి, రూ. 11 లక్షల నగదు, 18 తులాల బంగారం అందజేశారు.

అయితే, రెండు సంవత్సరాల క్రితం అశ్విని సోదరి వివాహం కోసం ఆమె తల్లిదండ్రులు తమ భూమిని అశ్విని మామ కృష్ణ వద్ద తాకట్టు పెట్టి రూ. 3 లక్షలు వడ్డీకి తీసుకున్నారు. కొంతకాలంగా కట్నం కింద ఇవ్వాల్సిన మిగిలిన డబ్బుతో పాటు అప్పుగా తీసుకున్న సొమ్మును కూడా తీసుకురావాలని అశ్విని భర్త, అత్తమామలు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. వారి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన అశ్విని తన గదిలో, చిన్నారి కళ్లెదుటే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చాలాసేపటి వరకు చిన్నారి ఏడుస్తూ ఉండటంతో కుటుంబ సభ్యులు తలుపు తట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికీలో నుండి చూడగా అశ్విని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అల్లుడు మరియు అతని తల్లిదండ్రులు తన కూతురిని వేధిస్తున్నారని, అంతేకాకుండా ఆమె భర్త కొట్టాడని కూడా తమ దృష్టికి తీసుకువచ్చిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనితో పోలీసులు భర్త మరియు అత్తమామలపై కేసు నమోదు చేశారు. 


More Telugu News