అమర్‌నాథ్ యాత్ర.. 18 రోజుల్లో మూడు లక్షలకు పైగా మంది ద‌ర్శ‌నం

  • అమర్‌నాథ్ యాత్రకు భారీగా త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు 
  • ఆదివారం నాటికి 3.07 లక్షల మంది యాత్రికుల దర్శనం
  • ఈ నెల 3న ప్రారంభ‌మైన యాత్ర‌.. ఆగస్టు 9న ముగింపు
అమర్‌నాథ్ యాత్రకు భారీగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ నెల 3న యాత్ర ప్రారంభం కాగా.. 18 రోజుల్లో మూడు ల‌క్ష‌ల‌కు పైగా మంది భ‌క్తులు హిమాల‌యాల్లోని మంచు శివ‌లింగాన్ని ద‌ర్శించుకున్నారు. ఆదివారం నాటికి 3.07 లక్షల మంది యాత్రికులు పవిత్ర దర్శనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఆగస్టు 9న యాత్ర ముగియనుంది. ఇంకా 20 రోజులు మిగిలి ఉన్నందున ఈ ఏడాది 3.50 లక్షలకు పైగా మంది భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకునే అవకాశం ఉంద‌ని అధికారిక అంచనా. 

"ఈరోజు భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లలో 3,791 మంది యాత్రికులు లోయకు బయలుదేరారు. 1,208 మంది యాత్రికులతో బాల్టాల్ బేస్ క్యాంప్‌కు 52 వాహనాలతో కూడిన మొదటి ఎస్కార్ట్ కాన్వాయ్ తెల్లవారుజామున 3.33 గంటలకు బయలుదేరగా, 2,583 మంది యాత్రికులతో పహల్గామ్ బేస్ క్యాంప్‌కు 96 వాహనాలతో కూడిన రెండవ ఎస్కార్ట్ కాన్వాయ్ తెల్లవారుజామున 4.06 గంటలకు బయలుదేరింది" అని అధికారులు తెలిపారు. 

శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) ఛైర్మన్, జ‌మ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం బాల్తాల్ బేస్ క్యాంప్‌ను సందర్శించారు. యాత్ర సజావుగా సాగేందుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంబంధిత అధికారులతో సమావేశమ‌య్యారు. అలాగే బాల్తాల్‌లోని కమ్యూనిటీ కిచెన్‌ ఒకదానిలో యాత్రికులతో కలిసి భోజనం చేశారు. యాత్రికులతో కూడా మనోజ్ సిన్హా మాట్లాడారు. కాగా, ఈ యాత్ర కోసం ప్ర‌భుత్వం భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. 


More Telugu News