టీమిండియాకు ఎదురుదెబ్బ‌.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నుంచి నితీశ్‌ కుమార్ రెడ్డి ఔట్!

  • జిమ్‌లో క‌స‌ర‌త్తు చేస్తూ గాయ‌ప‌డ్డ‌ నితీశ్‌ కుమార్ రెడ్డి
  • స్కాన్‌లలో లిగ్‌మెంట్ దెబ్బతిన్నట్లు వెల్ల‌డి
  • దీంతో సిరీస్‌లోని మిగ‌తా రెండు టెస్టుల్లో అత‌డు ఆడ‌డం లేద‌ని స‌మాచారం
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ‌ తగిలింది. భారత ఆల్ రౌండర్ నితీశ్‌ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ నుంచి వైదొలిగిన‌ట్లు మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆల్ రౌండర్ జట్టుతో కలిసి మాంచెస్టర్‌కు వెళ్లాడు కానీ ఆదివారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనలేద‌ని స‌మాచారం. 

జిమ్‌లో క‌స‌ర‌త్తు చేస్తున్నప్పుడు నితీశ్‌ కుమార్ రెడ్డికి గాయం అయింది. స్కాన్‌లలో లిగ్‌మెంట్ దెబ్బతిన్నట్లు తేలింద‌ని ఈఎస్‌పీఎన్ (ESPN) క్రిక్‌ఇన్ఫో తెలిపింది. దీంతో సిరీస్‌లోని మిగ‌తా రెండు టెస్టుల్లో అత‌డు ఆడ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇక, రెండో టెస్టులో అద‌ర‌గొట్టిన పేస‌ర్ ఆకాశ్ దీప్ సైతం గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. అయితే, వీరిద్ద‌రి గాయాల గురించి బీసీసీఐ నుంచి అధికారిక స‌మాచారం వెలువ‌డ‌లేదు. 

కాగా, నితీశ్ కుమార్‌ రెడ్డికి గాయం కార‌ణంగా శార్దూల్ ఠాకూర్ ప్లేయింగ్ XIలోకి తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉంది. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్ట్‌లో అంత‌గా ఆక‌ట్టుకోని కార‌ణంగా శార్దూల్‌ను ప‌క్క‌న‌బెట్టి నితీశ్ కుమార్‌ను జ‌ట్టులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఫాస్ట్‌ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ కోటాలో వారిని తీసుకోవ‌డం జ‌రిగింది. 

మరోవైపు మ‌రో సీమ‌ర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా చేతికి గాయం కార‌ణంగా సిరీస్ నుంచి వైదొలిగిన విష‌యం తెలిసిందే. అత‌ని స్థానంలో అన్షుల్ కాంబోజ్ భార‌త జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక‌, ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భారత్‌ 1-2 తేడాతో వెనుకంజ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సిరీస్‌లో నిల‌వాలంటే టీమిండియా ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టులో తప్పక గెలవాలి. ఇలాంటి ప‌రిస్థితిలో భార‌త జ‌ట్టులో కీల‌క ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌డం అనేది పెద్ద‌ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 


More Telugu News