కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి... ఇప్పుడు కక్షసాధింపు అంటారా?: మంత్రి అనగాని

  • ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దర్యాప్తు
  • వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
  • కక్ష సాధింపు చర్య అంటూ వైసీపీ నేతల ఆగ్రహం
  • జగన్ పై మండిపడిన మంత్రి అనగాని
మద్యం కుంభకోణంలో భారీ దోపిడీకి పాల్పడ్డారంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి, ఇప్పుడు అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు చర్యలంటారా? అని మండిపడ్డారు. డిజిటల్ చెల్లింపులు లేకుండా వేల కోట్ల రూపాయలను దోచుకున్న వారిని సిట్ అధికారులు విచారణ చేస్తూ నిందితులను ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రజలకు, విచారణ అధికారులకు సమాధానం చెప్పకుండా... కక్షసాధింపు అనడం సరికాదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి అనగాని వైసీపీ అధినేత జగన్‌పైనా విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అరాచక పాలన సాగించి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణంలో నిందితుల ఆస్తుల జప్తుకు విజయవాడ కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని, ఆగస్టు 1లోపు నిందితులకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని మంత్రి వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News