తమ ఊరిపై ఎగురుతున్న డ్రోన్లను కర్రలతో తరిమే ప్రయత్నం చేసిన గ్రామస్తులు!

  • యూపీలో భయాందోళనలకు గురిచేస్తున్న డ్రోన్లు
  • బులంద్ షహర్ జిల్లా జైలుపై ఎగిరిన డ్రోన్
  • ఒక వ్యక్తి అరెస్ట్
  • పలు గ్రామాలపైనా డ్రోన్ల సంచారం
  • రాత్రిపూట గస్తీలు కాస్తున్న గ్రామస్తులు
ఉత్తరప్రదేశ్‌లో డ్రోన్ల కదలికలు స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. బులంద్‌షహర్ జిల్లా జైలు పైన ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించడంతో ఈ భయాలు మరింత తీవ్రమయ్యాయి. శుక్రవారం సాయంత్రం జైలు పైన డ్రోన్ ఎగురుతూ కనిపించిన కొన్ని గంటల్లోనే దాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి, డ్రోన్‌ను ఎగరేసిన భూపేంద్ర సింగ్ (25) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అనధికారికంగా డ్రోన్ ఎగరేయడం, ఫోటోగ్రఫీ నిషేధిత ప్రాంతంలో వీడియో తీయడం వంటి ఆరోపణలపై అతడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్క) సెక్షన్ 223, 351(1), ఐటీ చట్టం, జైలు చట్టం, క్రిమినల్ లా (సవరణ) చట్టం కింద కేసు నమోదు చేశారు.

బిజ్నోర్, మొరాదాబాద్, అమ్రోహా వంటి జిల్లాల్లో కూడా రాత్రివేళల్లో 'వింత కాంతులు' కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ డ్రోన్లు దొంగతనాలకు సంబంధించినవి కావచ్చనే అనుమానంతో గ్రామస్తులు రాత్రిపూట గస్తీలు నిర్వహిస్తున్నారు. సియోహారా (బిజ్నోర్)లో గ్రామస్తులు టార్చిలైట్లతో రాత్రంతా కాపలా కాస్తున్నారు. 

చాజ్లాట్ (మొరాదాబాద్)లో ఒక వ్యక్తి ఆకాశంలోకి కాల్పులు జరిపాడు. బుఖారీపూర్‌లో డ్రోన్ కనిపించిన కొన్ని గంటల్లో ఒక ఈ-రిక్షా బ్యాటరీ మాయమైంది. బిజ్నోర్ ఎస్పీ సంజీవ్ వాజ్‌పేయీ మాట్లాడుతూ, రాత్రి గస్తీలను పెంచామని, స్థానికంగా డ్రోన్‌ల విక్రయాలను గమనిస్తున్నామని వెల్లడించారు. సోషల్ మీడియాలో వీడియోలను పరిశీలిస్తున్నామని తెలిపారు. "కొంతమంది కేవలం కొంటెతనంతో ఇలా డ్రోన్లు ఎగరేస్తుండవచ్చు" అని అన్నారు. 

కాగా, జైలు ఘటన తప్ప, మరే ఇతర ఘటనలోనూ డ్రోన్ పైలట్లను గుర్తించలేదు, లేదా డ్రోన్లను స్వాధీనం చేసుకోలేదు. అయినప్పటికీ, గ్రామాల్లో జనం ఆకాశం వైపు జాగ్రత్తగా చూస్తూనే ఉన్నారు. గ్రామస్తులు టార్చిలైట్లు, రాళ్లు, కర్రలతో డ్రోన్లను తరిమికొడుతున్నారు. చాలా ఊళ్లలో గ్రామస్తులు గంటల తరబడి ఇళ్ల పైకప్పులపై కాపలా కాయడం వంటి దృశ్యాలకు కనిపిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నప్పటికీ, డ్రోన్ల ఆపరేటర్ల గురించి ఇంకా స్పష్టత రాలేదు.


More Telugu News