Shikhar Dhawan: నాకు నా దేశ‌మే ముఖ్యం.. పాక్‌తో మ్యాచ్ ఆడేది లేద‌ని ఆరోజే చెప్పా: శిఖ‌ర్ ధావ‌న్

Shikhar Dhawan told WCL organisers he wont play against Pakistan on May 11 itself
  • వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌) 2025 టోర్నీ
  • టోర్నీలో భాగంగా ఇవాళ‌ భార‌త్‌, పాక్‌ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్దు
  • ప‌లువురు టీమిండియా మాజీ క్రికెట‌ర్లు ఈ మ్యాచ్ ఆడేందుకు విముఖ‌త 
  • ఈ మేర‌కు డ‌బ్ల్యూసీఎల్ నిర్వాహ‌కుల ప్ర‌క‌ట‌న‌
  • తాను మే 11నే చెప్పాన‌ని.. పాక్‌తో మ్యాచ్ ఆడేది లేద‌న్న గ‌బ్బ‌ర్
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌) 2025లో భాగంగా ఈ రోజు భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్దు అయింది. ప‌లువురు టీమిండియా మాజీ క్రికెట‌ర్లు ఈ మ్యాచ్ ఆడేందుకు విముఖ‌త చూప‌డమే కార‌ణ‌మ‌ని డ‌బ్ల్యూసీఎల్ నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. శిఖ‌ర్ ధావ‌న్‌, హార్భ‌జ‌న్ సింగ్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్‌, యూసుఫ్ పఠాన్ స‌హా ప‌లువురు మాజీలు ఈ మ్యాచ్ నుంచి వైదొలిగారు. 

దీంతో చేసేదేమీలేక నిర్వాహ‌కులు మ్యాచ్‌ను క్యాన్సిల్ చేశారు. ఈ మేర‌కు తాజాగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియం వ‌ద్ద‌కు ప్రేక్ష‌కులు ఎవ‌రూ రావొద్ద‌ని, టికెట్ కొనుగోలు చేసిన వారికి డ‌బ్బులు రీఫండ్ చేస్తామ‌ని నిర్వాహ‌కులు త‌మ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కాగా, పాక్‌తో మ్యాచ్ ఆడేది లేద‌ని తాను మే 11నే చెప్పాన‌ని గ‌బ్బ‌ర్ ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా పోస్టు చేసిన కొద్దిసేప‌టికే డ‌బ్ల్యూసీఎల్ నిర్వాహ‌కులు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

ఇదిలాఉంటే.. 26 మంది పర్యాటకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మాజీ భారత క్రికెటర్లు పాకిస్థాన్‌తో పోటీ పడటంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న విష‌యం తెలిసిందే. 

నేను అప్పుడే చెప్పా.. పాక్‌తో మ్యాచ్ ఆడేది లేద‌ని: గ‌బ్బ‌ర్‌ 
పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో తాను పాల్గొనడం లేదని శిఖర్ ధావన్ తాజాగా ఎక్స్‌లో ధ్రువీకరించాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు సంబంధించి భార‌త‌ జట్టు టోర్నమెంట్ నిర్వాహకులకు పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్‌ను భారత మాజీ బ్యాట్స్‌మన్ షేర్ చేశాడు.

యువ‌రాజ్ సింగ్ సారథ్యంలో టీమిండియా ఛాంపియ‌న్స్ టోర్నీ బ‌రిలోకి దిగింది. అయితే, తొలి మ్యాచ్ పాకిస్థాన్ ఛాంపియ‌న్స్ తో కావ‌డం గ‌మ‌నార్హం. అయితే, తాను ఈ మ్యాచ్ ఆడేది లేద‌ని.. ఈ విష‌యాన్ని డ‌బ్ల్యూసీఎల్ నిర్వాహ‌కుల‌కు తాను ఇప్ప‌టికే చెప్పిన‌ట్లు గ‌బ్బ‌ర్ వెల్ల‌డించాడు. మే 11నే లీగ్ నిర్వాహ‌కుల దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు మెయిల్ స్క్రీన్ షాట్ల‌ను ధావ‌న్ పంచుకున్నాడు.    

"జో కదమ్ మే 11 కో లియా, ఉస్పే ఆజ్ భీ వైసేహీ ఖడా హూన్. మేరా దేశ్ మేరే లియే సబ్ కుచ్ హై. ఔర్ దేశ్ సే బడ్క‌ర్ ఔర్ కుచ్ నహీ హోతా. (ఈ లీగ్‌లోని పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడ‌కూడ‌ద‌ని మే 11నే నేను నిర్ణయం తీసుకున్నా. నేను ఇప్పటికీ అదే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్నా. నాకు నా దేశ‌మే ముఖ్యం. దేశం కంటే ఏదీ గొప్పది కాదు)" అని శిఖ‌ర్ ట్వీట్ చేశాడు.  
Shikhar Dhawan
India vs Pakistan
World Championship of Legends
WCL 2025
Harbhajan Singh
Irfan Pathan
Yusuf Pathan
Cricket Match Cancelled
Pahalgam Terrorist Attack

More Telugu News