Nookeshwari: అనకాపల్లి జిల్లాలో ఘటన... ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసిన మహిళ

Nookeshwari planned reporter murder with lover in Anakapalli
  • రిపోర్టర్ హత్యకు మహిళ ప్లాన్ 
  • కిరాయి హంతక ముఠాకు సుపారీ 
  • పొరబాటున మరో వ్యక్తిపై హత్యాయత్నం చేసిన సుపారీ గ్యాంగ్ 
  • మరోసారి ప్రయత్నంలో ఉండగా అరెస్టు చేసిన పోలీసులు
తన వద్ద తీసుకున్న నగదు, నగలు ఇవ్వకపోగా, తన వివాహేతర సంబంధం గురించి ప్రియుడి భార్యకు చెప్పి గొడవకు కారణమైన రిపోర్టర్‌ను అంతమొందించడానికి ఓ మహిళ చేసిన ప్లాన్, సుపారీ గ్యాంగ్ చేసిన తప్పిదంతో దొరికిపోయింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం తిమ్మాపురంలో జరిగింది. ప్రియుడితో కలిసి నలుగురికి మహిళ సుపారీ ఇవ్వగా, ఆ గ్యాంగ్ రిపోర్టర్‌ను కాకుండా మరో వ్యక్తిపై దాడి చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ కేసులో సదరు మహిళతో పాటు ఆమె ప్రియుడు, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

డీఎస్పీ మోహనరావు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్. రాయవరానికి చెందిన మేడిశెట్టి నూకేశ్వరికి తునికి చెందిన వ్యక్తితో గతంలో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా మూడేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. ఆమె భర్తకు దూరంగా ఉంటున్నా తరచు వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ తరుణంలో ఓ ఛానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఈ సమస్యను పోలీసుల ద్వారా పరిష్కరిస్తానని నూకేశ్వరిని నమ్మబలికి ఆమె వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, 6.5 తులాల బంగారం తీసుకున్నాడు.

అయితే ఆ తర్వాత సదరు రిపోర్టర్, నూకేశ్వరికి మధ్య గొడవ జరగడంతో తన వద్ద తీసుకున్న నగలు, నగదు వెనక్కి ఇవ్వాలని నూకేశ్వరి డిమాండ్ చేసింది. అతను ఇవ్వకపోవడంతో రిపోర్టర్‌పై నూకేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో సదరు రిపోర్టర్ నూకేశ్వరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న పైడిరాజు అనే వ్యక్తి భార్యకు వీరి సంబంధం గురించి చెప్పాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవకు కారణమైన రిపోర్టర్‌ను అంతమొందించాలని నూకేశ్వరి, ఆమె ప్రియుడు పైడిరాజు పథకం రచించారు. ఇందుకు తుని ప్రాంతానికి చెందిన కిరాయి రౌడీలు సాకాడ్ అలియాస్ శ్యామ్, కిసరపూడి జాను ప్రసాద్, రాయడి రాజ్ కుమార్‌తో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 11న ముగ్గురు కిరాయి రౌడీలకు రిపోర్టర్ ఇంటిని నూకేశ్వరి, పైడిరాజులు చూపించారు. రౌడీలు అదే రోజు రాత్రి మద్యం సేవించి రిపోర్టర్ ఇంటి పక్కన ఉన్న నాగేశ్వరరావు అనే వ్యక్తిపై రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

ఆ తర్వాత పని పూర్తి చేశామని, డబ్బు ఇవ్వాలని రౌడీలు నూకేశ్వరిని కోరగా, తాము చెప్పిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిపై దాడి చేశారని, డబ్బులు ఇచ్చే పని లేదని చెప్పింది. దీంతో వారు రెండో రోజు ఆ పని పూర్తి చేస్తామని చెప్పారు. ఆ మరుసటి రోజు రౌడీలు రిపోర్టర్ ఇంటికి వెళ్లేందుకు సిద్దమవుతుండగా, సీఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణరావు సిబ్బందితో అక్కడికి వెళ్లి నిందితులను పట్టుకున్నారు. వారిని పోలీసులు విచారించగా, రిపోర్టర్‌ను హత్య చేసేందుకు నూకేశ్వరి, పైడిరాజు సుపారీ ఇచ్చిన విషయం చెప్పారు. దీంతో నూకేశ్వరి, పైడిరాజుతో పాటు కిరాయి రౌడీలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
Nookeshwari
Anakapalli district
Supari gang
Extra marital affair
Reporter murder plan
Paidiraju
Crime news Andhra Pradesh
എസ് രാമവരം
Timmapuram
Andhra Pradesh police

More Telugu News