హైడ్రా విజయాలతో పాటు సవాళ్లను కూడా ఎదుర్కొంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్

  • ఏడాది కాలంలో హైడ్రాపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామన్న రంగనాథ్
  • ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ప్రజలకు అవగాహన వచ్చిందని వెల్లడి
  • ఏడాది కాలంలో 500 ఎకరాలు కాపాడినట్లు వెల్లడి
ఈ సంవత్సరం విజయాలతో పాటు పలు సవాళ్లను కూడా ఎదుర్కొన్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో హైడ్రాపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామని ఆయన వెల్లడించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏమిటో ప్రజలకు హైడ్రా ద్వారా అవగాహన వచ్చిందని తెలిపారు. అదే సమయంలో చెరువులు, నాలాల వద్ద ఆక్రమణలు కూడా తగ్గినట్లు వెల్లడించారు. ఏడాది కాలంలో దాదాపు 500 ఎకరాల వరకు కాపాడామని అన్నారు.

ఈ భూమి విలువ సుమారు రూ.30 వేల కోట్లు ఉంటుందని రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా కారణంగా కబ్జాలు తగ్గాయని అన్నారు. దాదాపు 20 చెరువుల్లో ఆక్రమణలను తొలగించినట్లు ఆయన వెల్లడించారు. నిన్న భారీ వర్షం కురిసినప్పటికీ ఈ నీరు బతుకమ్మకుంట చెరువులో చేరడం ద్వారా వరదను తగ్గించినట్లు చెప్పారు. దాని వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని అన్నారు. మరికొన్ని చెరువుల్లో కూడా ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు.

హైడ్రా వచ్చిన తర్వాత నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని వెల్లడించారు. ఆక్రమణల విషయంలో హైడ్రా చాలా సీరియస్‌గా ఉందని అన్నారు. మూసీతో హైడ్రాకు సంబంధం లేకపోయినప్పటికీ తమకు ఆపాదించారని అన్నారు. హైడ్రా పెద్దల జోలికి వెళ్లదు, పేదలను లక్ష్యంగా చేసుకుంటుందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News