Russia Ukraine war: 300 డ్రోన్లు, 30 క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

Russia Launches Heavy Drone Missile Attacks on Ukraine
  • దాడిలో అనేక నివాస భవనాలు, ఆసుపత్రులు ధ్వంసమైనట్లు తెలిపిన ఉక్రెయిన్
  • భవనాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకున్నట్లు వెల్లడి
  • దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్‌పై 300కు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో అనేక నివాస భవనాలు, ఆసుపత్రులు, వాహనాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. భవనాల శిథిలాల కింద అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని, వారిని బయటకు తీసుకురావడానికి భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ఈ దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఒడెసా నగరంపై 20కి పైగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. భారీ ఆస్తి నష్టం సంభవించిందని, ఈశాన్య సుమీ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని తెలిపారు. యుద్ధం సమయంలో తమకు అండగా ఉంటూ ఆయుధాలను సరఫరా చేస్తున్న మిత్ర పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉక్రెయిన్‌కు ఆస్ట్రేలియా కూడా ఆయుధ సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా కీవ్‌కు ఎం1ఏ1 అబ్రమ్స్ ట్యాంకులను అందజేసింది. ఇతర సామగ్రిని రాబోయే నెలల్లో పంపించనున్నట్లు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ పేర్కొన్నారు. కీవ్‌పై మాస్కో అనైతిక, చట్టవిరుద్ధమైన దండయాత్రకు వ్యతిరేకంగా ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది.
Russia Ukraine war
Ukraine war
Russia attack
Zelensky
Kyiv
Drones
Missiles
Odesa

More Telugu News