'విశ్వంభ‌ర' టీజ‌ర్‌పై కావాలనే నెగిటివ్ ప్ర‌చారం.. కానీ ట్రైలర్ చూస్తే వాళ్లకు నోట మాట రాకపోవచ్చు: వ‌శిష్ఠ‌

  • చిరంజీవి, వశిష్ఠ కాంబోలో ‘విశ్వంభర’
  • భారీ స్థాయిలో రూపొందుతున్న సోషియో-ఫాంటసీ మూవీ
  • 'విశ్వంభ‌ర' టీజ‌ర్‌పై గ్రాఫిక్స్ విష‌యంలో ట్రోల్స్‌
  • ట్రోల‌ర్స్‌కు ట్రైల‌ర్‌తో స‌మాధానం చెబుతామ‌న్న ద‌ర్శ‌కుడు
  • అంచనాలకు మించి సినిమా ఉంటుందని వెల్ల‌డి
మెగాస్టార్ చిరంజీవి, ‘బింబిసార’ ఫేమ్‌ మల్లిడి వశిష్ఠ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ సోషియో-ఫాంటసీ సినిమా భారీ బ‌డ్జెట్‌తో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ద‌ర్శ‌కుడు వశిష్ఠ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశ్వంభ‌ర టీజ‌ర్‌పై కొంద‌రు కావాల‌నే నెగిటివ్ ప్ర‌చారం చేశార‌ని అన్నారు. అయితే, వారంద‌రికీ ట్రైల‌ర్‌తో గ‌ట్టి స‌మాధానం చెప్ప‌బోతున్న‌ట్లు వ‌శిష్ఠ పేర్కొన్నారు. 

వ‌శిష్ఠ మాట్లాడుతూ... "టీజర్ వచ్చినప్పుడు కొన్ని ట్రోల్స్ వచ్చాయి. కొంద‌రు కావాలనే నెగిటివ్ ప్ర‌చారం చేశారు. కానీ, ట్రైలర్ చూశాక వాళ్లకు నోట మాట రాకపోవచ్చు. సినిమా అయితే అంచనాలకు మించి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్‌ను ఈ మూవీలో స‌రికొత్త‌గా చూస్తారు. ఇప్పటివరకు చూడని లుక్‌లో, మాయాజాలంతో కూడిన ప్రపంచంలో చూపించబోతున్నా. ప్రేక్షకులు ఊహించిన దానిక‌న్నా ఎక్కువ మేజిక్ చేస్తా" అని అన్నారు.

కాగా, 'విశ్వంభర' టీజర్ తర్వాత గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు వచ్చిన విష‌యం తెలిసిందే. అందుకే మేక‌ర్స్ హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దించారు. ఈ సినిమాలో 4,676 వీఎఫ్ఎక్స్ (VFX) షాట్స్ ఉంటాయని వశిష్ఠ చెప్పారు. గ్రాఫిక్స్ కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇది భారతీయ‌ సినిమా చరిత్రలోనే భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్ కలిగిన ప్రాజెక్ట్ అవుతుందని చెబుతున్నారు.

ఇక‌, ఈ సినిమాలో చిరు స‌ర‌స‌న‌ త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గ్రాఫిక్స్ వ‌ర్క్స్‌ పూర్తికాగానే మేక‌ర్స్‌ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. 


More Telugu News