మాజీ భార్య కోసం దొంగగా మారిన నాగ్ పూర్ వాసి.. కారణం ఇదే..!

  • విడాకుల తర్వాత నెలనెలా భరణం చెల్లించాలని కోర్టు తీర్పు
  • ఉద్యోగం లేకపోవడంతో భరణం చెల్లించలేక ఇబ్బందులు
  • చైన్ స్నాచింగ్ చేస్తూ మాజీ భార్యకు డబ్బులు పంపించిన వైనం
మాజీ భార్యకు నెలనెలా భరణం చెల్లించేందుకు ఓ వ్యక్తి దొంగ అవతారమెత్తాడు. చైన్ స్నాచింగ్ చేస్తూ మాజీ భార్యకు డబ్బులు పంపించాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలైన ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగ్‌ పూర్‌ లో కొన్ని నెలల క్రితం ఓ వృద్ధురాలు మెడలో బంగారు గొలుసు దొంగతనం జరిగింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి చైన్ లాక్కొని పారిపోయాడు. వృద్ధురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దాని ఆధారంగా తమకు వచ్చిన సమాచారంతో గణపతినగర్‌కు చెందిన కన్హయ్య నారాయణ్‌ బౌరాషి అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
 
విచారణలో చైన్ స్నాచింగ్ కు పాల్పడింది తానేనని కన్హయ్య అంగీకరించాడు. కొంతకాలంగా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నానని చెప్పాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా.. నెలనెలా రూ.6 వేలు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని వివరించాడు. సంపాదన లేకపోవడంతో భరణం చెల్లించేందుకు దొంగగా మారినట్లు తెలిపాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు చైన్లు దొంగిలించినట్లు చెప్పాడు. చోరీ చేసి తీసుకొచ్చిన బంగారాన్ని స్థానిక నగల వ్యాపారికి అమ్మానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ వ్యాపారిని కూడా అరెస్టు చేశారు.


More Telugu News