అలా చెప్పడం తొందరపాటే అవుతుంది.. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమెరికా బోర్డు

  • విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రాలేమన్న ఎన్‌టీఎస్‌బీ
  • మీడియా వార్తలను ‘అపరిపక్వ, ఊహాజనిత’ వార్తలుగా పేర్కొన్న వైనం
  • తుది నివేదిక వచ్చేందుకు ఏడాది, అంతకుమించి సమయం పట్టే అవకాశం ఉందన్న బోర్డు
  • ఇంధన స్విచ్‌లు ఎలా ఆఫ్ అయ్యాయన్న దానిపైనే దర్యాప్తు అధికారుల దృష్టి
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్‌టీఎస్‌బీ) అభిప్రాయపడింది. ఇంధన స్విచ్‌లను కెప్టెన్ ఆఫ్ చేయడమే ప్రమాదానికి కారణమని వస్తున్న వార్తల నేపథ్యంలో సేఫ్టీ బోర్డ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రమాదానికి కారణంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని స్పష్టం చేసింది.

ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తా కథనాలపై ఎన్‌టీఎస్‌బీ చైర్ పర్సన్ జెన్నిఫర్ హోమెండీ ఎక్స్‌లో స్పందిస్తూ.. మీడియా వార్తలను ‘అపరిపక్వ, ఊహాజనిత’ కథనాలుగా కొట్టిపడేశారు. ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఎన్‌టీఎస్‌బీతో కలిసి భారత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో విమాన ప్రమాదానికి గల కారణాలపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని ఏఏఐబీ, ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ప్రజలను కోరారు.  తుది నివేదిక వచ్చేందుకు ఒక ఏడాది, లేదంటే అంతకంటే ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

కాగా, ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన వెంటనే అందులోని రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ‘కటాఫ్’ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా ఇంజిన్లలో ఇంధనం నిండుకుంది. ఇది జరిగిన పది సెకన్లలోనే విమానం ప్రమాదానికి గురైంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డును బట్టి  ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ మరో కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌తో మాట్లాడుతూ ఇంధన స్విచ్‌లు కటాఫ్ మోడ్‌లోకి ఎందుకు వెళ్లాయని ప్రశ్నించాడు. దానికి ఆయన ‘నాకు తెలియదు’ అని సమాధానం ఇచ్చాడు. 

ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో ఇదే కీలకంగా మారింది. ఇంధన స్విచ్‌లు ఎందుకు ఆఫ్‌ అయ్యాయన్న అంశంపైనే దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదంటే అనుకోకుండా జరిగిన మానవ చర్య ఫలితామా? లేదంటే విమాన వ్యవస్థల వైఫల్యమా? అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. 


More Telugu News