బహవాల్పూర్‌కు 1,000 కిలోమీటర్ల దూరంలో.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మసూద్ అజార్?

  • ఆపరేషన్ సిందూర్ తర్వాత స్కర్దూలోని సద్‌పర రోడ్‌‍లో గుర్తించిన ఇంటెలిజెన్స్
  • ఆ తర్వాత గిల్గిత్ బల్టిస్థాన్ ప్రాంతంలో అతని కదలికల గుర్తింపు
  • ఆపరేషన్ సిందూర్‌లో 10 మంది అజార్ కుటుంబ సభ్యుల మృతి
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అజార్ నివాస ప్రాంతమైన బహవల్పూర్ నుండి 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిల్గిత్ బల్టిస్థాన్ ప్రాంతంలో అతడి కదలికలను భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అంతకుముందు, స్కర్దూలోని సద్‌పర రోడ్ ప్రాంతంలో అతడిని గుర్తించారు. ఆ ప్రాంతంలో రెండు మసీదులు, మదర్సాలు, ప్రైవేటు, ప్రభుత్వ అతిథి గృహాలు ఉన్నాయి.

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ఆ తర్వాత అతను మొదట స్కర్దూలో కనిపించగా, ఇప్పుడు గిల్గిత్ బల్టిస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించారు.

మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండే అవకాశం ఉందని అంతకుముందు పాకిస్థాన్‌కు చెందిన పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. అవసరమైతే అతడిని భారత్‌కు అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, అజార్ తమ దేశంలో లేడని ఆయన స్పష్టం చేశారు. భారత్ కనుక సాక్ష్యాలు సమర్పిస్తే అతన్ని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. హఫీజ్ సయీద్ కూడా పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడనే వార్తల్లో నిజం లేదని బిలావల్ పేర్కొన్నారు. అతను కస్టడీలో ఉన్నట్లు చెప్పారు. మసూద్ అజార్ మాత్రం ఎక్కడ ఉన్నాడో తెలియదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మసూద్ అజార్ పీవోకేలోనే ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.


More Telugu News