ఒవైసీ కళాశాలపై పదేపదే ప్రశ్నిస్తున్నారు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

  • హైడ్రాకు ఏ కళాశాల అయినా ఒక్కటేనన్న రంగనాథ్
  • హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన
  • సల్కం చెరువుకు తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదన్న రంగనాథ్
ఒవైసీ కళాశాలల విషయంలో పదేపదే తమను ప్రశ్నిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏ కళాశాల అయినా ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని బతుకమ్మకుంట వద్ద విద్యార్థులు, స్థానికులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మానవహారం నిర్వహించారు. నీటి వనరుల పరిరక్షణపై హైడ్రా ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. మూసీకి సంబంధం లేకున్నా హైడ్రాకు ముడిపెట్టారని ఆయన పేర్కొన్నారు. ఒవైసీ కాలేజీల విషయంలో తమ నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పామని, హైడ్రా సామాజిక కోణంలోనే పని చేస్తుందని అన్నారు. ఒవైసీ కళాశాలలను 2015-16లో నిర్మించారని, కళాశాల ఉన్న చెరువు ప్రాంతానికి 2016లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు.

సల్కం చెరువుకు తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదని, నగరంలో 80 శాతం చెరువులకు తుది నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదని ఆయన అన్నారు. 140 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ జారీ చేశారని, 540 చెరువులకు పదేళ్ల క్రితం ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారని రంగనాథ్ వివరించారు. సల్కం చెరువు నోటిఫికేషన్ ప్రక్రియలో ఉన్న సమయంలో ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనధికారిక నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు.

ఒవైసీ కళాశాలపైనే ఎందుకు అంత ఆసక్తి అని ఆయన ప్రశ్నించారు. హైడ్రాకు ఏ వర్గం కళాశాల అయినా ఒకటే అని స్పష్టం చేశారు. పేదవాళ్ల మీద హైడ్రా పగబట్టిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆక్రమణల వెనుక చాలామంది పెద్దలు ఉన్నారని, వాళ్లు తప్పించుకోవడానికి పేదలను ముందుకు తీసుకువస్తున్నారని చెప్పారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, తమ ఆస్తులు ఆక్రమణదారులకు చిక్కకుండా ప్రజలు పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బతుకమ్మ సంబరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అందుకు అనుగుణంగా బతుకమ్మకుంటను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.


More Telugu News