నిమిష ప్రియ కేసు.. చర్చల కోసం యెమెన్‌కు వెళ్లడంపై కేంద్రం అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు

  • బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు యెమెన్‌కు వెళ్లడానికి అనుమతి కోరిన బృందం
  • తమ వైపు నుంచి చర్యలు చేపడుతున్నామన్న కేంద్రం
  • కేంద్రం స్పందనపై సుప్రీంకోర్టు సంతృప్తి
యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో, బాధితుని కుటుంబంతో మాట్లాడేందుకు యెమెన్‌కు వెళ్ళడానికి అనుమతి కోరుతూ ఆమె తరఫు న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి పొందాలని సూచించింది. నిమిష ప్రియ కేసును సుప్రీంకోర్టు తాజాగా మరోసారి విచారించింది.

ఈ సందర్భంగా, నిమిష ప్రియకు విధించిన మరణశిక్షను యెమెన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు. నిమిష ప్రియ క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

నిమిష ప్రియ కేసులో కేంద్ర ప్రభుత్వం స్పందన పట్ల సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో కేంద్రం సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది.

విచారణ సందర్భంగా, నిమిష ప్రియ తరఫు న్యాయవాదుల బృందం ఒక అభ్యర్థనను కోర్టుకు సమర్పించింది. బాధితుని కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు యెమెన్‌కు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం యెమెన్‌కు వెళ్లడానికి ఆంక్షలు ఉన్నందున, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.


More Telugu News