ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు.. సుప్రీంకోర్టులో లాలుకు దక్కని ఊరట

  • ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలు యాదవ్‌పై ఆరోపణలు
  • లాలు ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’కు తెరతీసినట్టు సీబీఐ కేసు
  • ఢిల్లీ కోర్టు కార్యకలాపాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
  • కేసు విచారణను వేగవంతం చేయాలని ఆదేశాలు
ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు తన పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ లాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో ట్రయల్ కోర్టు కార్యకలాపాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతేకాదు, ఈ కేసు విచారణను  వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.

లాలూ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలున్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఉన్న వెస్ట్ సెంట్రల్ జోన్ ఆఫ్ ఇండియన్ రైల్వేలో గ్రూప్ డి నియామకాల సమయంలో లాలు ఈ కుంభకోణానికి తెరతీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆయన భార్య, వారి ఇద్దరు కుమార్తెలు, మరో అధికారి కూడా ఉన్నారు.

లాలూ యాదవ్ తన పిటిషన్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 2022, 2023, 2024లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేసిందని, కుంభకోణం జరిగినట్టుగా చెబుతున్న 14 సంవత్సరాల తర్వాత కేసు నమోదైందని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు మే 29న ఈ కేసును విచారిస్తూ కార్యకలాపాలను నిలిపివేయడానికి ఎటువంటి బలవంతపు కారణాలు లేవని తెలిపింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ లాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు విచారణ ఆగస్టు 12న జరగనుంది.


More Telugu News