Madhya Pradesh: మెడలో పాము వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. చివ‌రికి జ‌రిగింది ఇదీ!

Snake Catcher Dies After Cobra Bites Him During a Rescue
  • పాములు పట్టే ఓ వ్యక్తి పాము కాటుకే బ‌లైన వైనం
  • ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకుని బైక్‌పై వెళ్లిన స్నేక్ క్యాచ‌ర్
  • అది కాటేయ‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి
  • మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో ఘటన
స్నేక్ క్యాచ‌ర్ అయిన ఓ వ్య‌క్తి ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లాడు. అయితే, ఆ పాము అతడ్ని కాటేసింది. పదేళ్లుగా వందలాది పాములు పట్టిన అతడు చివ‌రికి పాము కాటుకే బ‌ల‌య్యాడు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

వివ‌రాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాఘోగఢ్‌లోని కాట్రా మొహల్లా ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల దీపక్ మహాబర్‌ పదేళ్లుగా పాములు పడుతున్నాడు. ఎవరైనా తమ ఇంట్లో పాము ఉందని అతడికి ఫోన్‌ చేయగానే అక్కడి వెళ్లేవాడు. పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేవాడు. 

ఇలా పదేళ్లకుపైగా వందల సంఖ్యలో పాములు పట్టాడు. ఎవరి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకునేవాడు కాదు. ఉచితంగానే పాములు పట్టి సురక్షిత ప్రాంతంలో విడిచి పెట్టేవాడు. జేపీ యూనివర్సిటీలో పాములు పట్టే వ్యక్తిగా పాప్యుల‌ర్‌ అయ్యాడు.

పామును మెడలో వేసుకొని.. బైక్‌పై ఊరంతా షికారు
ఈ క్ర‌మంలో ఈ నెల‌ 14న రాఘోగఢ్‌లోని బర్బత్‌పురాలో ఒక ఇంట్లోకి పాము ప్రవేశించినట్లు దీపక్‌కు ఫోన్‌ వచ్చింది. దీంతో బైక్‌పై అక్కడకు చేరుకున్నాడు. ఆ పామును పట్టుకున్నాడు. అయితే, కుమారుడి స్కూల్‌ ముగిసే సమయం కావడంతో ఆ పామును మెడలో వేసుకుని బైక్‌పై అక్కడకు వెళ్లాడు. కుమారుడితో కలిసి బైక్‌పై ఇంటికి చేరుకున్నాడు.

మరోవైపు దీపక్‌ మెడలో పాము ఉండటం చూసి అతడి ఇంటి వద్ద కొందరు వీడియో రికార్డ్‌ చేశారు. ఆ తర్వాత మెడలో ఉన్న ఆ పాము అతడి చేతిపై కాటు వేసింది. దీంతో దీపక్‌ ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పి సహాయం కోరాడు. తొలుత రాఘోగఢ్‌లోని స్థానిక ఆసుపత్రికి అతడ్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గుణాలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కాగా, సోమవారం సాయంత్రం దీపక్‌ పరిస్థితి మెరుగుపడినట్లు కనిపించింది. దీంతో ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. అయితే, ఆ రాత్రికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు దీపక్‌ను మ‌ళ్లీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అత‌డు మృతిచెందాడు. కాగా, కాటుకు ముందు మెడలోని పాముతో బైక్‌పై ఉన్న దీపక్‌ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్‌గా మారింది.
Madhya Pradesh
Deepak Mahawar
snake catcher
snake bite
Guna district
Raghogarh
snake rescue
viral video
India news
snake on bike

More Telugu News