కన్నడ నటుడు దర్శన్‌కు హైకోర్టు బెయిల్.. అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

  • రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్
  • గత ఏడాది బెయిల్‌పై వచ్చిన దర్శన్
  • బెయిల్ రావడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో దర్శన్‌కు గత ఏడాది అక్టోబర్‌లో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఆ తర్వాత డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ లభించింది.

రాష్ట్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

వాస్తవానికి హైకోర్టు తన విచక్షణాధికారం ఉపయోగించిన తీరుతో తాము ఏకీభవించలేకపోతున్నామని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో మేమెందుకు జోక్యం చేసుకోకూడదు? అని ప్రశ్నించింది.

బెయిల్ రద్దు చేయాలని వారు (రాష్ట్ర ప్రభుత్వం) కోరుతున్నారని, కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మీరు చూసే ఉంటారని దర్శన్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్‌ను ఉద్దేశించి జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు.


More Telugu News