Anamika: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి మెమరీ లాస్... భార్య 49 రోజుల అన్వేషణ ఫలించింది!

Anamika Husband Found After Memory Loss Road Accident
  • ఢిల్లీలో ఆసక్తికర ఘటన
  • ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాని వ్యక్తి 
  • రోడ్డు ప్రమాదంలో గాయపడి జ్ఞాపకశక్తి కోల్పోయిన వైనం
  • 49 రోజుల తర్వాత ఆచూకీ లభించిన వైనం
ప్రేమ, నమ్మకం, నిరీక్షణల కలబోతగా నిలిచిన అనామిక, దీపక్‌ల హార్ట్ టచింగ్ కథ ఇది. ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాలో 2018లో తొలిసారి కలుసుకున్న ఈ జంట, ప్రేమలో పడి వివాహం చేసుకుని బాదర్‌పూర్‌లోని ఓ చిన్న ఇంటిలో ఉన్నంతలో హ్యాపీగా ఉండేది. వారి ఆనందంపై అకస్మాత్తుగా చీకటి కమ్ముకుంది.

2025 మే 23న, దీపక్ బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన అనామిక రాత్రంతా స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో, మరుసటి రోజు సరాయ్ ఖ్వాజా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రోజుల తరబడి దీపక్‌ను వెతికింది. తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి, గురుద్వారా, స్థానిక ప్రాంతాల్లో అతని ఫోటో చూపిస్తూ గాలించింది. నిరాశలోనూ ఆమె నమ్మకాన్ని కోల్పోలేదు. తన భర్త ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడని గట్టిగా విశ్వసించింది.

దీపక్ ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి, జ్ఞాపకశక్తి కోల్పోయి ఓ ఆసుపత్రిలో ఉన్నాడని అప్పటికి ఆమెకు తెలియదు. 49 రోజుల ఉత్కంఠ తర్వాత, హెడ్ కానిస్టేబుల్ నితిన్... దీపక్ ఫోటో ఆధారంగా అతడిని గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన అనామిక భర్తను చూసి కన్నీటి పర్యంతమైంది. అయితే అతడు జ్ఞాపకశక్తి కోల్పోవడంతో భార్యను గుర్తుపట్టలేకపోయాడు. 

ప్రస్తుతం దీపక్ కోలుకుంటున్నాడు. అతడు మెమరీ లాస్ తో బాధపడుతున్నప్పటికీ, అనామిక ఓపికగా, ప్రేమతో అతన్ని సంరక్షిస్తోంది. ఇప్పుడు ఆమె కుటుంబ ఆదాయ బాధ్యతను కూడా తీసుకుంది. "కొన్ని రోజులు అతను నన్ను గుర్తుపట్టడు, అయినా నాకు నమ్మకం తిరిగి వచ్చింది" అని ఆమె దృఢంగా చెప్పింది. ఈ కథ ప్రేమ బంధం యొక్క గొప్ప శక్తిని, కష్టాలెదురైనా ఆశను వదులుకోకూడదనే సందేశాన్ని ఇస్తుంది.
Anamika
Deepak
Memory loss
Road accident
Delhi
Sarai Khwaja Police Station
Missing person
Gurudwara
Husband wife
India

More Telugu News