వ్యభిచారానికి అంగీకరించలేదని మహిళను కత్తితో పొడిచి చంపిన ప్రియుడు

  • విభేదాలతో భర్తను వదిలివేసి యువకుడితో సహజీవనం చేస్తున్న వివాహిత మహిళ పుష్ప
  • వ్యభిచారానికి ఒప్పుకోకపోవడంతో చాకుతో పుష్పను పొడిచి యువకుడు పరారైన వైనం
  • తీవ్ర గాయాలతో మృతి చెందిన పుష్ప
  • బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఘటన  
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యభిచారానికి నిరాకరించినందుకు ప్రియుడు కత్తితో పొడిచి వివాహితను హత్య చేశాడు.

వివరాల్లోకి వెళితే, రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికి చెందిన ఓలేటి పుష్ప (22)కు నాలుగేళ్ల క్రితం దగ్గరి బంధువుతో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది నెలలకే భర్తతో విభేదాలు రావడంతో ఆమె విడిపోయింది. అనంతరం విజయవాడలో కారు ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న షేక్ షమ్మ (22) అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

కొంతకాలంగా బి. సావరం గ్రామం, సిద్ధార్థ నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. గంజాయి, ఇతర వ్యసనాలకు బానిసైన షేక్ షమ్మ డబ్బు కోసం పుష్పను నిత్యం వేధిస్తుండేవాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన షమ్మ, అర్జెంటుగా డబ్బు కావాలని, వ్యభిచారం చేయడానికి తనతో రావాలని పుష్పను బలవంతం చేశాడు.

పుష్ప నిరాకరించడంతో ఆగ్రహించిన షమ్మ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచాడు. అడ్డుకోబోయిన పుష్ప సోదరుడు, తల్లిని కూడా గాయపరిచి షమ్మ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News