Ayatollah Khamenei: ఇజ్రాయెల్ పై మరోసారి నిప్పులు చెరిగిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

Ayatollah Khamenei Slams Israel Again
  • అమెరికా చెప్పుచేతల్లో నడిచే దేశం ఇజ్రాయెల్ అని విమర్శలు
  • ఇజ్రాయెల్ ను అమెరికా పెంపుడు కుక్క అని అభివర్ణించిన ఖమేనీ
  • దాడులు కొనసాగిస్తే మరిన్ని పెద్ద దెబ్బలు తప్పవని హెచ్చరిక
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరోసారి ఇజ్రాయెల్ పై నిప్పులు చెరిగారు. అమెరికా చెప్పుచేతల్లో నడిచే దేశం ఇజ్రాయెల్ అని విమర్శించారు. ఇజ్రాయెల్ ను క్యాన్సర్ కణితితో పోల్చిన ఖమేనీ... అమెరికా నేరాల్లో ఇజ్రాయెల్ భాగస్వామి అని ఆరోపించారు. ఆయన అంతకంటే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇజ్రాయెల్ ను 'అమెరికా పెంపుడు కుక్క' అని అభివర్ణించారు. కనీసం ఆ దేశానికి సొంత అస్తిత్వం కూడా లేదని దెప్పిపొడిచారు.  

పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా దాడులు కొనసాగిస్తే దానికి మరిన్ని పెద్ద దెబ్బలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ను అమెరికానే ప్రోత్సహిస్తోందని, ఇజ్రాయెల్ చర్యలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఖమేనీ అన్నారు. ఇక, ఇజ్రాయెల్ తో తాము గొప్పగా పోరాడామని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేసినా తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 
Ayatollah Khamenei
Iran
Israel
Khamenei
Middle East conflict
Palestine
US foreign policy
Iran Israel relations
Israel Palestine conflict
Iranian Supreme Leader

More Telugu News