Cyber fraud: 11 లక్షలు ఇచ్చినా ఆగని వేధింపులు.. బెంగళూరులో వ్యక్తి ఆత్మహత్య

Cyber Fraud Drives Bangalore Man Kumar to Suicide After Losing 11 Lakh
  • మృతుడు విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి
  • ఇటీవల సీబీఐ ఆఫీసర్ పేరుతో సైబర్ మోసగాడి ఫోన్ కాల్
  • డిజిటల్ అరెస్ట్ అంటూ వేధించడంతో మనస్తాపం
సైబర్ మోసగాళ్ల వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు.. డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి లక్షలు కాజేసినా వేధింపులు ఆపకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్వగ్రామంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తాను ఎదుర్కొన్న వేధింపులకు సంబంధించి వివరాలు పేర్కొన్నాడు. అయితే, బాధితుడి ఫోన్ లాక్ చేసి ఉండడంతో పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు.

కర్ణాటకలోని కెలగెరె గ్రామానికి చెందిన కుమార్ బెంగళూరులో విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన సైబర్ మోసానికి గురయ్యాడు. సీబీఐ ఆఫీసర్ ను అంటూ విక్రమ్ గోస్వామి అనే సైబర్ మోసగాడు ఫోన్ చేసి కుమార్ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని బెదిరించాడు. డిజిటల్ అరెస్ట్ అని బెదిరించి కుమార్ బ్యాంకు ఖాతాలో నుంచి విడతలవారీగా రూ.11 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. పదే పదే ఫోన్ చేస్తూ వేధించడంతో కుమార్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. దీనికి తోడు అనారోగ్యం వేధిస్తుండడంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

మంగళవారం స్వగ్రామానికి వెళ్లి ఊరి చివర ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. బుధవారం కుమార్ మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, కుమార్ సెల్ ఫోన్ లాక్ చేసి ఉండడంతో వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని పోలీసులు చెప్పారు.
Cyber fraud
Digital arrest scam
Bangalore suicide
Kumar suicide
Karnataka crime
Vikram Goswami
Cyber harassment
Online fraud India
Financial fraud
Suicide due to cybercrime

More Telugu News