Anil Chauhan: నిన్నటి తరం ఆయుధాలతో నేడు విజయం సాధించలేం.. ఆపరేషన్ సిందూర్‌పై సీడీఎస్ చౌహన్ సంచలన వ్యాఖ్యలు

Anil Chauhan stresses need for modern technology in Indian Army
  • భారత సైన్యం ఆధునీకరణపై దృష్టి సారించాలన్న సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
  • ఆధునిక యుద్ధ సన్నాహాల్లో సైబర్ దాడులు, డ్రోన్ ఆధారిత దాడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య
  • మన శత్రువులు నిరంతరం కొత్త సాంకేతికతలను అవలంబిస్తున్నారన్న జనరల్ చౌహాన్
ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కోవడానికి సంప్రదాయ ఆయుధాలు సరిపోవని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత సైన్యం అత్యాధునిక సాంకేతికత, ఆధునిక యుద్ధ వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ మేరకు గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ను ఉదహరిస్తూ ఆధునిక సాంకేతికత ప్రాముఖ్యతను వివరించారు.

మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక రక్షణ సదస్సులో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. సైన్యం ఆధునీకరణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. "ప్రస్తుత యుద్ధాలను గత కాలపు ఆయుధాలతో గెలవడం సాధ్యం కాదు. ఆధునిక యుద్ధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, సైబర్ వార్‌ఫేర్, అధునాతన ఆయుధ వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ వంటి కార్యకలాపాలు ఈ వాస్తవాన్ని స్పష్టంగా చూపించాయి" అని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ విజయం ఆధునిక యుద్ధ పద్ధతులు, సాంకేతికత ప్రాముఖ్యతను రుజువు చేసిందని జనరల్ చౌహాన్ పేర్కొన్నారు.

ఆధునిక యుద్ధ సన్నాహాల్లో సైబర్ దాడులు, డ్రోన్ ఆధారిత దాడులు, ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జనరల్ చౌహాన్ తెలిపారు. భారత సైన్యం ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి తన సామర్థ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకోవాలని, అందుకు ప్రభుత్వం, రక్షణ పరిశోధన సంస్థల సహకారం అవసరమని పేర్కొన్నారు. "మన శత్రువులు నిరంతరం కొత్త సాంకేతికతలను అవలంబిస్తున్నారు. మనం కూడా వాటికి తగ్గట్టుగా ముందుకు సాగాలి. ఆపరేషన్ సిందూర్ లాంటి విజయాలు మన సామర్థ్యాన్ని చూపిస్తాయి. కానీ మనం ఇంకా చాలా ముందుకు వెళ్లాలి" అని ఆయన అన్నారు.

భారత సైన్యం ఇటీవల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) సహకారంతో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, సైబర్ రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. జనరల్ చౌహాన్ ఈ ప్రయత్నాలను ప్రశంసిస్తూనే, రక్షణ బడ్జెట్‌లో సాంకేతిక పరిజ్ఞానానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.  
Anil Chauhan
CDS Anil Chauhan
Operation Sindoor
Indian Army
modern warfare
defense technology
cyber warfare
drone technology
military modernization
DRDO

More Telugu News