KTR: ఫుల్ టైమ్ హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తున్నాం: కేటీఆర్ ఫైర్

KTR Fires at CM Revanth Reddy Over Law and Order in Telangana
  • 24 గంటల్లోనే ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారన్న కేటీఆర్
  • రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార యంత్రాంగం పని చేస్తోందని విమర్శ
  • క్షీణిస్తున్న శాంతిభద్రతలు ప్రభుత్వానికి విపత్తుగా మారాయని వ్యాఖ్య
నిన్న హైదరాబాద్ లోని మలక్ పేట్ లో సీపీఐ నేత చందునాయక్ ను దుండగులు తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. మరోవైపు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత, పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్ర యంత్రాంగం మొత్తం వ్యక్తిగత ప్రతీకార రాజకీయాల కోసం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం పని చేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి ఫుల్ టైమ్ హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఆయన సోదరులు రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని నడిపిస్తే ఏం జరుగుతుందో చూస్తున్నామని అన్నారు. ఎలాంటి అనుభవం, అవగాహన లేని వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుంటే ఏం జరుగుతుందో చూస్తున్నామని ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్ హయాంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉండేదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 24 గంటల్లోనే ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారని అన్నారు. క్షీణిస్తున్న శాంతిభద్రతలు, అభద్రతాభావం రేవంత్ ప్రభావానికి ఓ విపత్తుగా మారిందని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు.
KTR
K Taraka Rama Rao
Telangana
Revanth Reddy
BRS
Congress
Law and Order
Chandhu Naik
Medak
Crime

More Telugu News