మరో 8 రోజుల్లో పదవీ విరమణ .. ఇంతలోనే ఏసీబీకి చిక్కిన కమీషన్‌ల కమిషనర్

  • పనికో రేటు ఫిక్స్ చేసిన నల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ తారకనాథ్
  • కమిషనర్ తీరుపై కౌన్సిలర్లు తీర్మానం చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోని వైనం
  • ఓ గృహ నిర్మాణ దారుడి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పదవీ విరమణకు మరో 8 రోజులు ఉండగా, నగర పంచాయతీ కమిషనర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న నెల్లిమర్ల నగర పంచాయతీకి పదోన్నతిపై కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తారక్‌నాథ్ ఈ నెల 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

అయితే, కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి లంచం ఇస్తేనే పని చేస్తాననే నిబంధన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పనికి ఒక రేటు నిర్ణయించారు. ఇంటి నిర్మాణ అనుమతులకు రూ.20 వేలు, పన్ను విలువ తగ్గింపునకు రూ.5 వేలు, సిబ్బంది సెలవుకు రూ.3 వేలు ఇలా ఏదో ఒక రూపంలో లంచం ఇస్తేనే ఆయన పని చేసేవారు. కమిషనర్ తీరుపై మూడు నెలల్లో అనేక ఆరోపణలు వచ్చాయి.

ఆయన పనితీరును నిరసిస్తూ ఏకంగా కౌన్సిల్ సమావేశంలోనే 16 మంది కౌన్సిలర్లు ఆయన్ను విధుల నుంచి తొలగించాలని తీర్మానం కూడా చేశారు. దీనిపై జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కమిషనర్ తన పద్ధతి మార్చుకోలేదు. ఇంటి నిర్మాణ ప్రణాళిక అనుమతి కోసం ఒక వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా, నిన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. 


More Telugu News