B Saroja Devi: వెండితెర వెన్నెల శిల్పం .. బి.సరోజాదేవి

B Sarojadevi Special
  • 1960లలో దూసుకుపోయిన కథానాయిక
  • మూడు భాషల్లో స్టార్ హీరోయిన్ గా సందడి 
  • విశాలమైన కళ్లతో చేసిన విన్యాసం 
  • ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న అభినయం

తెలుగు తెరపైకి ఎంతోమంది అందమైన కథానాయికలు వచ్చి వెళ్లారు. వాళ్లందరిలో చాలా తక్కువ మంది మాత్రమే ఎక్కువమంది మనసులలో నిలిచిపోయారు. అలాంటి కథానాయికల జాబితాలో బి.సరోజాదేవి ఒకరుగా కనిపిస్తారు. తెలుగు .. తమిళ  .. కన్నడ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోయిన నాయిక ఆమె. ఈ మూడు భాషల్లోను స్టార్ హీరోయిన్ గా కొనసాగడం ఆమెకే సాధ్యమైంది. ఆమె డేట్స్ కోసం ఆనాటి స్టార్ హీరోలు వెయిట్ చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

తెలుగులో సావిత్రి .. జమున .. కృష్ణకుమారి వంటి హీరోయిన్స్ బరిలో ఉండగా, మరొకరు ఆ వరుసలో చేరే ఆలోచన కూడా చేయని రోజులవి. ఎందుకంటే ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సినిమాలలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంత తేలికైన విషయం కాదు. సావిత్రి .. జమున .. కృష్ణకుమారిని దాటుకుని మరొకరికి వెళ్లడమనేది దాదాపుగా అసాధ్యం అన్నట్టుగా ఉండేది. అలాంటి ఒక చట్రాన్ని దాటుకుని వెళ్లి, ఇద్దరి కాంబినేషన్ లోను సూపర్ హిట్ సినిమాలు చేయగలగడం విశేషం.

1960లలో వరుస విజయాలతో సరోజాదేవి దూసుకుపోయారు. 'పెళ్లి కానుక'లో తన ప్రేమను త్యాగం చేసే వాసంతి పాత్రలో .. జగదేకవీరుని కథలో ఇంద్రుడి కుమార్తెగా .. 'శ్రీ కృష్ణార్జున యుద్ధం'లో సుభద్రగా .. 'అమరశిల్పి జక్కన'లో మంజరిగా .. 'శకుంతల'లో టైటిల్ రోల్ లోను ఆమె మెప్పించారు. చక్కని చిరునవ్వు .. చేపల్లా తళుక్కున మెరిసే కళ్లు .. ముద్దుముద్దు మాటలు సరోజాదేవిలో ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. అవే మిగతా హీరోయిన్స్ పోటీని తట్టుకుని ప్రత్యేకమైన స్థానంలో నిలిచేలా చేశాయి.

'జగదేకవీరుని కథ' చూస్తే, నిజంగానే ఆమె దేవలోకం నుంచి దిగివచ్చిందేమో అనిపిస్తుంది. 'అమరశిల్పి జక్కన'లో ఆ శిల్పి ఆమె రూపాన్ని చెక్కుతాడు. తెరపై ఆ శిల్పాన్ని చూడాలో .. ఆ పక్కనే ఉన్న సరోజాదేవిని చూడాలో ప్రేక్షకులకు అర్థం కాదు. అప్పుడే ప్రాణం పోసుకున్న శిల్పం లాంటి సరోజాదేవికి ఆ కాలంలో ఉన్న అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. కొన్ని దశాబ్దాల పాటు ఆమె తిరుగులేని కథానాయికగా కొనసాగారు. భౌతికంగా ఇప్పుడు ఆమె లేకపోయినా, చురుకైన కళ్లతో ఆమె చేసిన విన్యాసం ప్రేక్షకుల మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతుంది.

B Saroja Devi
Saroja Devi
Telugu cinema
actress
Tollywood
Jagadeka Veeruni Katha
actress biography
South Indian actress
classic Telugu movies
Indian cinema

More Telugu News