New Jersey Floods: న్యూయార్క్, న్యూజెర్సీలను ముంచెత్తిన ఆకస్మిక వరదలు

New Jersey Floods Flash Floods Hit New York New Jersey
  • ఈశాన్య, మధ్య-అట్లాంటిక్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
  • అత్యవసర పరిస్థితి ప్రకటించిన న్యూజెర్సీ గవర్నర్
  • పలు ప్రాంతాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ
ఈశాన్య, మధ్య-అట్లాంటిక్ ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా న్యూయార్క్, ఉత్తర న్యూజెర్సీలలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. "రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, అధిక వర్షపాతం కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాను. దయచేసి ఇళ్లలోనే ఉండండి, అనవసర ప్రయాణాలు మానుకోండి. న్యూజెర్సీవాసులు సురక్షితంగా ఉండండి" అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యూఎస్) న్యూయార్క్ సిటీలోని మాన్‌హటన్, బ్రూక్లిన్, క్వీన్స్, బ్రాంక్స్, స్టేటెన్ ఐలాండ్‌లకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది. నేటి సాయంత్రం నాటికి స్టేటెన్ ఐలాండ్‌లో 1.7 అంగుళాలు, మాన్‌హటన్‌లోని చెల్సియా పరిసరాల్లో 1.5 అంగుళాల వర్షం కురిసినట్టు నమోదైంది. రాత్రి వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరించింది.  

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు న్యూయార్క్ సిటీ మెట్రో వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. మన్‌హటన్‌లోని 28వ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో వరద నీరు టికెట్ టర్న్‌స్టైల్‌ల వద్దకు చేరింది. కొన్ని సబ్‌వే లైన్లలో సర్వీసు నిలిచిపోయింది. క్వీన్స్‌లోని రిచ్‌మండ్ హిల్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా దాదాపు 1,000 మంది ప్రభావితమయ్యారు. లాగ్వార్డియా, నెవార్క్ లిబర్టీ విమానాశ్రయాలలో విమానాలు ఆలస్యమయ్యాయి. జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. న్యూజెర్సీలోని స్కాచ్ ప్లెయిన్స్, యూనియన్ కౌంటీలలో వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రెస్క్యూ టీంలు ఫ్రంట్‌లోడర్‌లను ఉపయోగించి ప్రయాణికులను సురక్షితంగా తరలించాయి.   
New Jersey Floods
Phil Murphy
New York Floods
Northeast Flooding
Flash Floods
New York City
New Jersey
Manhattan
Subway
National Weather Service

More Telugu News