Revanth Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

Revanth Reddy and Chandrababu Naidu to Meet on Banakacherla Project
  • కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో బుధవారం భేటీ కానున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
  • గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించిన ఏపీ
  • దానివల్ల తమ రాష్ట్రం నష్టపోతుందని తెలంగాణ వాదన
  • తెలంగాణ కూడా గోదావరి జలాలను వినియోగించుకోవచ్చన్న ఏపీ
  • జల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా భేటీ
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ రేపు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సమావేశం జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అంశాలతో పాటు ఇతర ఎజెండా పాయింట్లను సమర్పించాలని జలశక్తి శాఖ రెండు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరింది. 

నిజానికి ఈ సమావేశం ఈ నెల 11న జరగాల్సి ఉండగా, సీఎంల అభ్యర్థన మేరకు 16వ తేదీకి వాయిదా పడింది. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ తేదీని ఖరారు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలను జలశక్తి మంత్రి చైర్మన్‌గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. ఈ భేటీ అపెక్స్ కౌన్సిల్ సమావేశంగా పరిగణించబడుతుందా? లేదా? అనేది స్పష్టంగా తెలియలేదు.

గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. గోదావరిలో సంవత్సరానికి 2,000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలుస్తోందని, ఈ జలాలను ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణం అవసరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ఈ జలాలను వినియోగించుకున్నా తమకు అభ్యంతరం లేదని, కేంద్రం సమక్షంలో చర్చల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో ఈ సమావేశం కీలకమైనదిగా భావిస్తున్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విజయవాడకు తరలించడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. పర్యావరణం, కేంద్ర జలసంఘం అనుమతులను నిరాకరించాలని వారు లేఖలు రాశారు. ఈ సమావేశం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Revanth Reddy
Banakacherla project
AP Telangana
Godavari River
water dispute
interstate meeting
Central Water Commission
Krishna River Management Board
Chandrababu Naidu
water resources

More Telugu News