Supreme Court of India: భార్య ఫోన్ సీక్రెట్ రికార్డింగ్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court Key Remarks on Wifes Phone Secret Recordings
  • భార్య నుండి విడాకులు కోరిన బఠిండాకు చెందిన వ్యక్తి
  • ఫోన్ రికార్డింగులను సాక్ష్యంగా పరిగణించవచ్చని తెలిపిన సుప్రీంకోర్టు
  • నిఘా పెట్టే పరిస్థితి వచ్చిందంటే వైవాహిక బంధం ఎంతగా బీటలు వారిందోనన్న సుప్రీంకోర్టు
భార్యాభర్తల మధ్య వివాహ బంధం ఎలా ఉందో భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగ్ లు స్పష్టం చేస్తాయని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పంజాబ్‌లోని బఠిండాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇలాంటి కేసుల్లో భాగస్వామి ఫోన్ రికార్డింగ్ లను సాక్ష్యంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. వారి మధ్య వివాహ బంధం బలంగా లేదనే విషయాన్ని ఆ రికార్డింగ్ లు స్పష్టం చేస్తాయని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై అంతకుముందు పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.

బఠిండాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అందుకు సాక్ష్యంగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డింగులను సమర్పించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసు విచారణను ప్రారంభించింది. దీనిని ఆమె పంజాబ్ హర్యానా హైకోర్టులో సవాల్ చేసింది.

తనకు తెలియకుండా, తన సమ్మతి లేకుండానే రికార్డింగ్ చేశాడని, వాటిని సాక్ష్యంగా పరిగణిస్తే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లే అవుతుందని భార్య హైకోర్టుకు తెలిపింది. విచారణ అనంతరం హైకోర్టులో ఆమెకు ఊరట దక్కింది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో ఆ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

భార్యాభర్తల మధ్య సంభాషణకు సంబంధించిన రికార్డింగ్ లను సాక్ష్యాలుగా పరిగణిస్తే వైవాహిక బంధాలు ప్రమాదంలో పడతాయని కొందరు చెబుతున్నారని, కానీ భాగస్వాములు ఒకరిపై మరొకరు నిఘా పెట్టే పరిస్థితి వచ్చిందంటే వారి వైవాహిక బంధం ఎంతగా బీటలు వారిందో అర్థం చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పరస్పరం విశ్వాసం లేదని అర్థమవుతోందని, అలాంటి వాటిని సాక్ష్యాలుగా పరిగణించవచ్చునని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసిన సుప్రీంకోర్టు, ఫ్యామిలీ కోర్టులో విచారణ కొనసాగించవచ్చునని తెలిపింది.
Supreme Court of India
Divorce case
Phone recording
Marital relationship

More Telugu News