Supreme Court of India: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు

Supreme Court on Hate Speech Strict orders to Central and State Governments
  • ఇలాంటి ప్రసంగాలను కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న ధర్మాసనం
  • కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
  • వాక్ స్వాతంత్ర్యం విలువలు ప్రజలు తెలుసుకోవాలన్న సుప్రీంకోర్టు
విద్వేషపూరిత ప్రసంగాల కేసులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి ప్రసంగాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అదే సమయంలో భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్ర్యపు విలువలను పౌరులు తెలుసుకొని, విద్వేషపూరిత ప్రసంగాల పట్ల సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలిపై వజహత్ ఖాన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారికి అవి ఎంత అసభ్యకరంగా, అనుచితంగా ఉంటున్నాయో ఎందుకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యాఖ్యలను షేర్ చేయకుండా కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ప్రజలు కూడా ఇటువంటి వాటిని షేర్ చేయకుండా సంయమనం పాటించాలని సూచించింది. ఇక్కడ సెన్సార్‌షిప్ గురించి మాట్లాడటం లేదని, కానీ ప్రజలు మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాలని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో విభజన ధోరణిని అడ్డుకోవాలని వ్యాఖ్యానించింది. భావప్రకటనా స్వేచ్ఛపై బాధ్యతాయుతమైన ఆంక్షలు సరైనవేనని సుప్రీంకోర్టు పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా విద్వేషపూరిత ప్రసంగాలను నిలువరించే మార్గాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది.
Supreme Court of India
Hate speech
Freedom of speech
Social media
Sharmistha Panoly

More Telugu News