Shubhanshu Shukla: భూమి పైకి శుభాంశు శుక్లా సహా వ్యోమగాములు తిరుగు ప్రయాణం

Shubhanshu Shukla and astronauts return to Earth
  • గత నెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు
  • డ్రాగన్ వ్యోమనౌకలో తమ తమ స్థానాల్లో కూర్చున్న నలుగురు వ్యోమగాములు
  • తిరిగి వచ్చాక వారం రోజుల పాటు క్వారంటైన్‌కు వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా వారు గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లిన విషయం విదితమే. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి వచ్చేందుకు వీలుగా శుభాంశు బృందం డ్రాగన్ వ్యోమనౌకలోకి చేరుకుంది. నలుగురు వ్యోమగాములు తమ తమ స్థానాల్లో కూర్చున్నారు.

భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 4.35 నిమిషాలకు వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంతో విడిపోనుంది. అనంతరం భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. వ్యోమనౌక దాదాపు 21 గంటల పాటు ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో దిగుతుంది. అనంతరం వారిని అక్కడి నుంచి క్వారంటైన్‌కు తరలిస్తారు. దాదాపు వారం రోజుల పాటు వ్యోమగాములు ఫ్లైట్ సర్జన్ పర్యవేక్షణలో ఉంటారు.

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు బృందం గత నెల 25న నింగిలోకి వెళ్లగా, 28 గంటల ప్రయాణం అనంతరం అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించింది. వీరి బృందం దాదాపు 15 రోజుల పాటు పలు ప్రయోగాలు చేసింది. ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాముల బృందం తమ మానసిక ఆరోగ్యంపై అధ్యయనం నిర్వహించింది.
Shubhanshu Shukla
Axiom-4 mission
International Space Station
Space travel

More Telugu News