మాధవన్ - ఫాతిమా సనా షేక్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'ఆప్ జైసా కోయి'. వివేక్ సోని దర్శకత్వం వహించిన ఈ సినిమా, నేరుగా 'నెట్ ఫ్లిక్స్' ఓటీటీ ట్రాక్ పైకి వచ్చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి హిందీతో పాటు ఇతర భాషలలోను స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.
కథ: శ్రీ (మాధవన్) 'జంషెడ్ పూర్' లోని ఒక స్కూల్లో సంస్కృతం బోధించే అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉంటాడు. 42 ఏళ్లు వచ్చినా అతను బ్యాచిలర్ గానే ఉండిపోతాడు. అన్నయ్య భాను ( శ్రీరామ్ భగ్నాని) వదిన కుసుమ (ఆయేషా రజా) ఇద్దరూ కూడా అతనికి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉంటారు. 'శ్రీ' ఆలోచనలను పెళ్లి వైపు తిప్పడానికి అతని స్నేహితుడు దీపక్ (నమిత్ దాస్) తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే అతను 'ఆప్ జైసా కోయి' అనే డేటింగ్ యాప్ ను శ్రీకి పరిచయం చేస్తాడు.
ఈ నేపథ్యంలోనే 'శ్రీ'కి ఒక సంబంధం వస్తుంది .. ఆ అమ్మాయి పేరే మధు బోస్ (ఫాతిమా సనా షేక్). ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న తరువాత, తమ అలవాట్లు .. అభిరుచులు దగ్గరగా ఉన్నాయనే విషయాన్ని గ్రహిస్తారు. ఇద్దరూ కలిసి ప్రయాణించాలనే నిర్ణయానికి వస్తారు. మధు తల్లిదండ్రులు .. ఆమె నానమ్మ అంతా కూడా ఈ సంబంధం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అలాగే శ్రీ అన్నావదినలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
శ్రీ - మధు నిశ్చితార్థానికి అన్నిరకాల ఏర్పాట్లు జరిగిపోతాయి. బంధుమిత్రులతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోతుంది. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని అప్పుడు మధూతో చెబుతాడు శ్రీ. అందుకు కారణం ఏమిటి? అప్పుడు మధు ఎలా ప్రతిస్పందిస్తుంది? ఆ తరువాత చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అనేది కథ.
విశ్లేషణ: చాలామంది పురుషులు పెళ్లి విషయంలో అమ్మాయిలకి కొన్ని పరిమితులు పెడుతూ ఉంటారు. వాటికి ఇష్టమైతేనే తమ పెళ్లి జరుగుతుందని తేల్చి చెబుతుంటారు. ఇక మరికొంతమంది పురుషులు వివాహమైన దగ్గర నుంచి, తమ సేవ చేసుకుంటూ వెళ్లడమే భార్య కర్తవ్యంగా భావిస్తూ ఉంటారు. సమయం ప్రకారం తమకి కావాల్సినవి సమకూర్చే ఒక యంత్రంగా చూస్తూ ఉంటారు. అలాంటి ఒక స్వభావం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
'ప్రేమ .. ప్రేమనే కోరుకుంటుంది' అనే ఒక కాన్సెప్ట్ తో ఈ కథను నడిపించారు. భిన్నమైన వాతావరణాలు .. కుటుంబాలు .. వ్యక్తుల స్వభావాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. శ్రీ - మధు పాత్రలను మలచిన తీరు బాగుంది. ఆ పాత్రల స్వరూప స్వభావాలను ఆవిష్కరించిన విధానం కూడా ఆలోచింపజేస్తుంది. అయితే ఈ రొమాంటిక్ కామెడీలో అటు రొమాన్స్ గానీ .. ఇటు కామెడీ గాని కనిపించవు.
ఈ కథలో హీరోయిన్ వైపు నుంచి కథను సమర్ధించడం కోసం, హీరో రియలైజ్ కావడం కోసం చూపించిన ఉదాహరణ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక పాత్రను ఉదాహరణగా చూపించేటప్పుడు, ఆ పాత్ర వ్యక్తిత్వం పెరగాలి గాని తగ్గకూడదు. ముఖ్యంగా గౌరవ ప్రదమైన కొన్ని పాత్రలపై అలాంటి ఉదాహరణలు రుద్దకూడదు. ఈ విషయమే కొంతమందికి మింగుడు పడదు.
పనితీరు: దర్శకుడు ఈ కథను ఎంచుకున్న తీరు, నడిపించిన విధానం బోర్ కొట్టదు. అలాగని చెప్పేసి నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంటును అందించదు. పరిమితమైన పాత్రల మధ్య ఈ కథ నిదానంగా నడుస్తూ ఉంటుంది. ఆర్టిస్టులంతా బాగానే చేశారు. దెవోజిత్ రే ఫొటోగ్రఫీ .. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. ప్రశాంత్ రామచంద్రన్ ఎడిటింగ్ ఫరవాలేదు.
ముగింపు: ఏదైతే ఒక లైన్ అనుకున్నారో ఆ లైన్ వరకూ మాత్రమే చెబుతూ వెళ్లారు. కథలో వినోదం పాళ్లను కలిపే ప్రయత్నం చేయలేదు. సందేశం బాగానే ఉంది గానీ, అందుకోసం చూపించిన ఉదాహరణ కాస్త ఇబ్బంది పెడుతుంది అంతే.
'ఆప్ జైసా కోయి' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Aap Jaisa Koi Review
- హిందీలో రూపొందిన 'ఆప్ జైసా కోయి'
- రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్లో నడిచే కథ
- నిదానంగా నడిచే కథనం
- తగ్గిన వినోదం పాళ్లు
Movie Details
Movie Name: Aap Jaisa Koi
Release Date: 2025-07-11
Cast: Madhavan, Fathima Sana Shaikh, Ayesha Raza, Manisha Chaudary, Namith Das
Director: Vivek Voni
Music: Justin Prabhakaran
Banner: Dharmatic Entertinment
Review By: Peddinti
Trailer