Utsav Shekhar: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన ఆడికారు

Utsav Shekhar Drunk Driving Accident Injures Five in Delhi
  • ఈ నెల 9న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
  • 8 ఏళ్ల చిన్నారి సహా ఐదుగురికి తీవ్ర గాయాలు
  • ట్రక్కును ఢీకొట్టి ఆగిన కారు.. నిందితుడి అరెస్ట్
ఢిల్లీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ ఆడికారు డ్రైవర్ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని తొక్కుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 9న తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో వసంత్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడైన డ్రైవర్‌ను ద్వారక ప్రాంతానికి చెందిన రియల్టర్ ఉత్సవ్ శేఖర్ (40)గా గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. నొయిడా నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అరెస్ట్ అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా తాగిన మత్తులో డ్రైవ్ చేసినట్టు తేలింది. 

గాయపడిన వారిని లఢీ (40), ఆమె కుమార్తె బిమ్ల (8), భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45), ఆయన భార్య నారాయణి (35)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని తొక్కుకుంటూ దూసుకెళ్లింది. అదే వేగంతో ముందుకెళ్తూ ట్రక్కును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మే నెలలోనూ ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపక్కన వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.  
Utsav Shekhar
Delhi accident
Vasant Vihar
drunk driving
road accident
car accident
footpath accident
India news
crime news
road safety

More Telugu News