Balochistan Liberation Front: పాకిస్థాన్ లో రెబెల్స్ దాడి... ఐడీ కార్డులు అడిగి మరీ చంపారు!

Balochistan Liberation Front Attack in Pakistan Kills 9
  • బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఘటన
  • బలూచ్ కు చెందని వారిని లక్ష్యంగా చేసుకున్న మిలిటెంట్లు
  • 9 మందిని కాల్చి చంపిన వైనం
  • దాడికి బాధ్యత తమదేనన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో గురువారం రాత్రి ప్రయాణికుల బస్సులపై తిరుగుబాటుదారులు దాడి చేసి 9 మందిని కాల్చి చంపారు. పంజాబ్ ప్రాంతానికి చెందిన వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తర్వాత బాధితులను లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం. డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం, క్వెట్టా నుండి పంజాబ్‌కు వెళుతున్న రెండు బస్సులను లోరలై-జోబ్ హైవేపై సుర్-డకై సమీపంలో అడ్డగించారు. సాయుధులు రోడ్డును బ్లాక్ చేసి, వాహనాల్లోకి ఎక్కి ప్రయాణికుల జాతీయ గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించిన వారిని తుపాకీతో బెదిరించి కిందకు దించి, ఆ తర్వాత చంపేశారు.

స్థానిక అధికారి నవీద్ ఆలం ఏఎఫ్ పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "ఉగ్రవాదులు రెండు ప్రయాణికుల బస్సులను హైవేపై ఆపి, తొమ్మిది మంది ప్రయాణికులను కిందికి దించారు. వారిని సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అందరినీ చంపేశారు" అని తెలిపారు. జిల్లా అడ్మినిస్ట్రేటర్ సాదత్ హుస్సేన్ మృతదేహాలను రోడ్డు పక్కన గుర్తించినట్లు ధృవీకరించారు. "మృతదేహాలన్నీ పంజాబ్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని బలగాలు గుర్తించాయి" అని ఆయన మీడియాకు చెప్పారు. "ఉగ్రవాదులు ప్రయాణికుల గుర్తింపు పత్రాలను కూడా తీసుకెళ్లి ఉంటారు" అని నవీద్ ఆలం డాన్‌తో అన్నారు.

కాగా, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ సంస్థ పాకిస్తాన్ ప్రభుత్వంపై చాలా కాలంగా తిరుగుబాటు చేస్తోంది. బలూచ్ కు చెందని పౌరులు మరియు సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటోంది. ఇస్లామాబాద్ నుంచి స్వాతంత్ర్యం కోసం బలూచ్ తిరుగుబాటు ఇటీవల సంవత్సరాలలో తీవ్రమైంది.

అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దాదారీ ఈ హత్యలను ఖండించారు. దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న నిషేధిత బలూచిస్తాన్ ఉగ్రవాదులే దీనికి కారణమని ఆయన ఆరోపించారు. గత సంవత్సరం జరిగిన ఇలాంటి దాడిలో 23 మంది ప్రయాణికులు మరణించారు. 
Balochistan Liberation Front
Pakistan
Balochistan
Rebels attack
Terrorist attack
Punjab
Asif Ali Zardari
Quetta
Loralai Job Highway

More Telugu News