నా చివరి శ్వాస వరకు ఇలాగే!: రాజీనామా ఆమోదం తర్వాత రాజాసింగ్ ట్వీట్

  • చివరి శ్వాస వరకు సమాజం కోసం, హిందువుల హక్కుల కోసం గొంతు వినిపిస్తానన్న రాజాసింగ్
  • జాతీయవాదం, సనాతన ధర్మ రక్షణ, హిందుత్వం కోసం పని చేస్తూనే ఉంటానని స్పష్టీకరణ
  • తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని లక్షలాది మంది కార్యకర్తలు కష్టపడుతున్నారన్న రాజాసింగ్
బీజేపీ అధిష్ఠానం తన రాజీనామాను ఆమోదించిన అనంతరం గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. పదవుల కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని, తుది శ్వాస వరకు సమాజ సేవలో నిమగ్నమవుతానని, హిందూ సమాజం హక్కుల కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సుమారు 11 సంవత్సరాల క్రితం తాను బీజేపీలో చేరిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేసుకున్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో పాటు హిందువుల హక్కుల పరిరక్షణ కోసం తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆ తరువాత బీజేపీ తనపై నమ్మకంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టును ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన బీజేపీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

తన రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించిందని ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. తాను పదవి కోసం, అధికారం కోసం లేదా వ్యక్తిగత కారణాల కోసం రాజీనామా చేయలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. హిందుత్వ సేవ కోసమే తాను జన్మించానని, తుది శ్వాస వరకు హిందుత్వం కోసం పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. హిందుత్వం, జాతీయవాదం, సనాతన ధర్మ పరిరక్షణకు తాను ఎల్లప్పుడు చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.


More Telugu News