పాకిస్థాన్ దాడిలో భారత్‌కు నష్టం కలిగిందన్న విదేశీ మీడియా ప్రచారంపై స్పందించిన అజిత్ దోవల్

  • ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా ప్రచారం
  • ఒక్క ఆధారం చూపించాలని అజిత్ దోవల్ సవాల్
  • మన సైన్యం, బ్రహ్మోస్ ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాయన్న దోవల్
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దాడిలో భారత్‌కు నష్టం వాటిల్లిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ దాడుల్లో భారత్‌కు నష్టం జరిగిందని ఒక్క ఆధారం చూపించాలని ఆయన సవాల్ విసిరారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించినట్లు చెప్పారు. మన సైన్యం పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిందని అన్నారు.

సామాజిక మాధ్యమాల్లో విదేశీ మీడియా చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు నష్టం వాటిల్లిందని చేస్తున్న ప్రచారం సరికాదని అన్నారు. అదే సమయంలో పాకిస్థాన్, పీవోకేలలో ఉగ్రవాద స్థావరాలను గుర్తించి మన సైన్యం కచ్చితత్వంతో దాడులు నిర్వహించిందని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి ఫొటోలు కూడా బయటకు వచ్చాయని తెలిపారు.

భారత్‌కు నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదని, నిజంగానే నష్టం జరిగిందని భావిస్తే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఆయుధ సంపత్తిని దేశీయంగా రూపొందిస్తోందని అజిత్ దోవల్ తెలిపారు. మన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌లోని పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయని అన్నారు. ఢిల్లీ లక్ష్యంగా పాకిస్థాన్ ప్రయోగించిన ఫతాహ్11 బాలిస్టిక్ క్షిపణులను భారత్ బలగాలు మధ్యలోనే సమర్థవంతంగా పేల్చివేశాయని తెలిపారు.


More Telugu News