Humaira Asghar Ali: నాలుగు రోజుల క్రితం ఫ్లాట్‌లో విగతజీవిగా పాక్ నటి.. 9 నెలల క్రితమే మృతి!

Pakistani Actress Humaira Asghar Ali Death Mystery Unfolds
  • నాలుగు రోజుల క్రితం కరాచీ ఫ్లాట్‌లో హుమైరా మృతదేహం గుర్తింపు
  • గతేడాది అక్టోబర్‌లోనే ఆమె మరణించినట్టు అనుమానం
  • నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని
  • పోలీసులు వచ్చి చూడటంతో విషయం వెలుగులోకి
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి హుమైరా అస్గర్ అలీ మంగళవారం కరాచీలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించింది. తాజాగా ఆమె మరణానికి సంబంధించి విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె మరణించి 9 నెలలు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహం కుళ్లిపోయే స్థితిలో ఉందని పోస్ట్‌మార్టం నిర్వహించిన కరాచీ పోలీస్ సర్జన్ డాక్టర్ సుమయా సయ్యద్ తెలిపారు.  

డీఐజీ సయ్యద్ అసద్ రజా మాట్లాడుతూ.. కాల్ డిటైల్ రికార్డ్ (సీడీఆర్) ప్రకారం హుమైరా చివరి కాల్ గతేడాది అక్టోబర్‌లో ఉన్నట్టు తెలిపారు. పొరుగింటి వారు కూడా ఆమెను చివరిసారి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో చూసినట్టు చెప్పారు. కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో గతేడాది అక్టోబర్‌లో అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. 

హుమైరా ఇంట్లో ఉన్న ఆహారం కూడా గడువు ముగిసిపోవడంతో ఆరు నెలల క్రితమే పాడైపోయిందని, బాటిళ్లు తుప్పుపట్టాయని మరో అధికారి తెలిపారు. ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే మిగతా వారు ఫిబ్రవరిలోనే తిరిగి రావడం, అప్పటికే మృతదేహం నుంచి వాసన రావడం తగ్గిపోవడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. కాగా, హుమైరా మృతదేహాన్ని స్వీకరించేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయితే, ఆమె సోదరుడు నవీద్ అస్గర్ మాత్రం కరాచీ వచ్చి సోదరి మృతదేహాన్ని తీసుకెళ్లారు. 

నవీద్ కథనం ప్రకారం.. హుమైరా ఏడేళ్ల క్రితం లాహోర్ నుంచి కరాచీ వచ్చింది. ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వెళ్లేది. ఏడాదిన్నర కాలంగా ఇంటికి వెళ్లలేదు. కాగా, హుమైరా నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో దాని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

హుమైరా అస్గర్ అలీ ఎవరు?
లాహోర్‌కు చెందిన హుమైరా అస్గర్ అలీ 2015లో ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టెలివిజన్ షోలైన ‘జస్ట్ మ్యారీడ్’, ‘ఎహసాన్ ఫరమోష్’, ‘గురు’, ‘చల్ దిల్ మేరే’ వంటి షోలలో సహాయ పాత్రల్లో నటించింది. అలాగే, 2015లో వచ్చిన ‘జలైబీ’, ‘లవ్ వ్యాక్సిన్’ (2021) వంటి సినిమాల్లోనూ నటించింది. 2022లో ఏఆర్‌వై డిజిటల్ ప్రసారం చేసిన రియాలిటీ షో ‘తమాషా ఘర్’లో పాల్గొనడం ద్వారా ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. 2023లో ‘నేషనల్ ఉమెన్ లీడర్‌షిప్ అవార్డ్స్’లో ‘బెస్ట్ ఎమర్జింగ్ ట్యాలెంట్ అండ్ రైజింగ్ స్టార్’ అవార్డును అందుకుంది. 
Humaira Asghar Ali
Pakistani actress
Humaira Asghar Ali death
Karachi apartment
Tamasha Ghar
ARY Digital
Pakistani television
Pakistani drama serials
Jalaibee movie
Ehsaan Faramosh

More Telugu News