Raja Reddy: రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్!

Deputy Collector Tahsildar Caught Taking Bribe in Sangareddy
  • జహీరాబాద్ నిమ్జ్‌లో లంచం తీసుకుంటూ ముగ్గురు అరెస్ట్
  • ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, డ్రైవర్ పట్టివేత
  • భూసేకరణ ఫైల్ ప్రాసెస్ చేశాక లంచం డిమాండ్
  • రూ. 50 వేలు డిమాండ్ చేసి, రూ. 15 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
  • ఫిర్యాదుదారుడి సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు
పని పూర్తి చేసి, పరిహారం చెక్కు చేతికిచ్చిన తర్వాత కూడా లంచం కోసం వేధించిన ప్రభుత్వ అధికారుల బండారాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బయటపెట్టారు. ఓ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు ముఖ్య అధికారులను, ఒక డ్రైవర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కలకలం రేపింది.

జహీరాబాద్‌లోని జాతీయ పెట్టుబడులు, తయారీ మండలం (నిమ్జ్) కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి చెందిన భూమిని సేకరించి, దానికి సంబంధించిన ఫైల్‌ను అధికారులు ప్రాసెస్ చేశారు. బాధితుడికి రూ. 52,87,500 పరిహారం చెక్కును కూడా అందజేశారు. అయితే, ఈ పని చేసినందుకు గాను నిమ్జ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, వారి డ్రైవర్ దుర్గయ్య కలిసి బాధితుడిని రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు... బేరసారాల అనంతరం రూ. 15,000 ఇచ్చేందుకు అంగీకరించాడు. గురువారం నాడు బాధితుడి నుంచి రూ. 15,000 లంచం తీసుకుంటుండగా, ముందుగా వేసిన పథకం ప్రకారం ఏసీబీ అధికారులు లంచగొండి అధికారులను పట్టుకున్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు గానీ, వాట్సాప్ (9440446106) ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
Raja Reddy
Sangareddy
Deputy Collector
Tahsildar
ACB Raid
Bribery Case
Corruption

More Telugu News