Chamala Kiran Kumar Reddy: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారు: బీఆర్ఎస్‌పై ఎంపీ చామల ఆగ్రహం

Chamala Kiran Kumar Reddy Slams BRS for Telangana Sentiment Politics
  • కేటీఆర్, హరీశ్ రావు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారని ఆరోపణ
  • కేటీఆర్ కేవలం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ స్థాయి కాదని వ్యాఖ్య
  • చర్చకు కేసీఆర్‌ను తీసుకురావాలని కేటీఆర్‌కు సవాల్
  • రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లో కేసీఆర్ ముంచారని విమర్శలు
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్‌కు లేదని, ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని వ్యాఖ్యానించారు.

భువనగిరి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వానికి సవాల్ విసరాల్సింది ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అని, కేటీఆర్ కాదని అన్నారు. నిజంగా దమ్ముంటే కేటీఆర్ తన తండ్రి నుంచి ప్రతిపక్ష హోదా తెచ్చుకుని మాట్లాడాలని సూచించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మిగులు బడ్జెట్‌తో అధికారం చేపట్టిన కేసీఆర్, రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఆ నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదని అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన 299 టీఎంసీల నీటిని పదేళ్ల పాలనలో ఎప్పుడూ పూర్తిగా వాడుకోలేకపోయారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గత ఏడాది 280 టీఎంసీలు వాడుకున్నామని తెలిపారు.

బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని, ఆరు నూరైనా దాన్ని అడ్డుకుని తీరుతామని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, గత ప్రభుత్వం కేవలం నోటిఫికేషన్లకే పరిమితమైందని ఆయన విమర్శించారు.
Chamala Kiran Kumar Reddy
BRS
Telangana Sentiment
KTR
Harish Rao
Revanth Reddy

More Telugu News