Azharuddin: హెచ్‌సీఏ అంశం, జగన్మోహన్ రావు అరెస్టుపై స్పందించిన అజారుద్దీన్

Azharuddin Reacts to HCA President Arrest Jaganmohan Rao
  • అధ్యక్షుడి అరెస్ట్ హెచ్‌సీఏకు అవమానమన్న మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్
  • అసోసియేషన్‌ను వెంటనే రద్దు చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్
  • తిరిగి బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధమని ప్రకటించిన అజార్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో సంచలనం రేగింది. ఉచిత ఐపీఎల్ టికెట్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ఫ్రాంచైజీని బెదిరించారనే ఆరోపణలతో పాటు, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ కేసుల్లో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

దీనిపై హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ స్పందించారు. ప్రస్తుత కమిటీని తక్షణమే రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

గురువారం మీడియాతో మాట్లాడిన అజారుద్దీన్, హెచ్‌సీఏ అధ్యక్షుడి అరెస్ట్ ఆ సంస్థకే పెద్ద అవమానమని అన్నారు. ఐపీఎల్ టికెట్ల విషయంలో అదనపు టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, అందుకు ఒప్పుకోకపోతే వేధించడం దారుణమని అన్నారు. గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి ఆటపై దృష్టి సారించాలని ప్రస్తుత సభ్యులకు ఆయన సూచించారు. అవకాశం వస్తే హెచ్‌సీఏ బాధ్యతలను మళ్లీ స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అజారుద్దీన్ ప్రకటించారు.

జగన్మోహన్ రెడ్డిని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సమర్పించినట్లు సీఐడీ అధికారులకు ఫిర్యాదు అందింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలను సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారు. గౌలీపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత.. ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారు. నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆరోపణలు వచ్చాయి.


Azharuddin
Hyderabad Cricket Association
HCA
Jaganmohan Rao Arrest
IPL Tickets Scam

More Telugu News