Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం

Narendra Modi Receives Namibias Highest Honor
  • నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
  • అవార్డును ప్రదానం చేసిన నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది-ద్వైత్వా
  • ఈ గౌరవం పొందిన తొలి భారత నేతగా మోదీ రికార్డు
  • 2014 నుంచి మోదీకి ఇది 27వ అంతర్జాతీయ పురస్కారం
  • ఆరోగ్యం, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు
  • ప్రస్తుత పర్యటనలో నాలుగు దేశాల నుంచి అత్యున్నత గౌరవాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ పురస్కారాన్ని చేర్చుకున్నారు. ఐదు దేశాల పర్యటనలో చివరిగా నమీబియాకు చేరుకున్న ఆయన, ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఏన్షియంట్‌ వెల్‌విట్షియా మిరాబిలిస్‌’ను అందుకున్నారు.

బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది-ద్వైత్వా ఈ గౌరవాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ నేతగా ప్రధాని మోదీ నిలవడం గమనార్హం. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన అందుకున్న 27వ అంతర్జాతీయ పురస్కారం ఇది.

ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ నమీబియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆ దేశ అధ్యక్షురాలితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వంటి కీలక రంగాల్లో సహకారం కోసం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కాగా, నమీబియాలో పర్యటించిన మూడో భారత ప్రధానిగా మోదీ నిలిచారు.

ఈ నెల 2న ప్రారంభమైన ప్రధాని ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాలను సందర్శించారు. బ్రెజిల్‌లోని రియోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనలో అర్జెంటీనా మినహా మిగిలిన నాలుగు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకోవడం విశేషం.
Narendra Modi
Namibia
Order of the Most Ancient Welwitschia Mirabilis
Netumbo Nandi-Ndaitwah

More Telugu News