ఏపీలో రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్: ఒకేరోజు 2 కోట్ల మందితో రికార్డుకు సిద్ధం!

  • రేపు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0
  • ఒకేరోజు 2.28 కోట్ల మంది భాగస్వామ్యంతో రికార్డుకు సన్నాహాలు
  • పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం
  • మంత్రి లోకేశ్ ఆలోచనతో ప్రభుత్వ బడుల్లో ఈ కార్యక్రమం
  • తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల అందజేత
  • పాఠశాలల పనితీరుపై అభిప్రాయాలు, సూచనల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో "మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) 2.0" నిర్వహించనుంది. ఒకేరోజు దాదాపు 2.28 కోట్ల మందిని భాగస్వాములను చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే ప్రధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.

ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలతో కలిపి మొత్తం 61 వేల విద్యా సంస్థలు పాలుపంచుకోనున్నాయి. ఈ సమావేశంలో 74.96 లక్షల మంది విద్యార్థులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, కోటిన్నరకు పైగా తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొననున్నారు. కార్పొరేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్ టీచర్ సమావేశాలను ప్రభుత్వ బడుల్లోనూ నిర్వహించాలన్న మంత్రి నారా లోకేశ్ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో ముఖ్యమైన విద్యా సంబంధిత కార్యక్రమం కావడం గమనార్హం.

ఈ సమావేశం ద్వారా తమ పిల్లల చదువు, ప్రవర్తన, ఇతర నైపుణ్యాల పురోగతిని తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చు. విద్యార్థుల సమగ్ర ప్రోగ్రెస్ కార్డులను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అందజేస్తారు. అంతేకాకుండా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, బోధన తీరుపై తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను, సూచనలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఇది ఒక చక్కటి వేదికగా ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమాన్ని ఏటా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


More Telugu News