హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు అరెస్ట్

  • ఐపీఎల్ టికెట్ల వివాదంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అరెస్ట్
  • జగన్మోహనరావుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న సీఐడీ
  • గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలెత్తిన గొడవ
  • విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీఐడీ చర్యలు
  • ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్టు నిర్ధారణ
  • కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేయడంతో ముదిరిన వివాదం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహనరావును సీఐడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీతో టికెట్ల విషయంలో తలెత్తిన వివాదమే ఈ అరెస్టుకు దారితీసింది. ఆయనతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం మధ్య టికెట్ల కేటాయింపుపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. తమకు టికెట్లు కేటాయించలేదనే కారణంతో హెచ్‌సీఏ అధికారులు సన్‌రైజర్స్‌కు చెందిన కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేయడం వివాదాస్పదమైంది. హెచ్‌సీఏ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం హైదరాబాద్ నుంచి తమ ఫ్రాంచైజీని తరలిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలోనే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావుపై తీవ్ర ఆరోపణలు చేసింది.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు, జగన్మోహనరావు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లు తమ నివేదికలో నిర్ధారించారు. ఆ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ, తాజాగా జగన్మోహనరావును అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది.


More Telugu News