YS Jagan: నా పర్యటనను డైవర్ట్ చేయడానికే ప్రసన్నపై దాడి: జగన్ ఫైర్

YS Jagan Fires at AP Government Over Attack on Prasanna Kumar Reddy
  • ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందన్న జగన్
  • ప్రసన్నను అంతం చేయాలనే లక్ష్యంతోనే దాడి చేశారని ఆరోపణ
  • రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపాటు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరిగిన హత్యాప్రయత్నమేనని సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.

పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన రౌడీలు ఈ దాడికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందన్నారు. వయసు పైబడిన ఆయన తల్లిని సైతం భయపెడుతూ టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించారని, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన భయంకర దాడి అని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక నేతను లక్ష్యంగా చేసుకుని ఇంత దారుణంగా దాడి చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు.

చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు తాను చేపట్టిన పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడికి కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా, ఈ దాడి గురించే రాష్ట్రమంతా మాట్లాడుకోవాలనేది వారి పథకమని విమర్శించారు. చంద్రబాబు తన 'రెడ్ బుక్' రాజ్యాంగంతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని జగన్ మండిపడ్డారు. హింస ద్వారా, కక్ష సాధింపు రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

YS Jagan
Nallapureddy Prasanna Kumar Reddy
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Nellore
Kovur
TDP
YSRCP
Political Attack
AP Government

More Telugu News