Affair with aunt: అత్తతో అఫైర్.. యువకుడిని చితకబాది, బలవంతపు పెళ్లి.. వీడియో ఇదిగో!

Bihar Man Assaulted Forced to Marry Aunt Alleged Affair
  • బీహార్‌లోని సుపాల్ జిల్లాలో జరిగిన అమానుష ఘటన
  • అడ్డువచ్చిన యువకుడి తల్లిదండ్రులపైనా దాడి
  • బాధితుడి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స
అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిపై బంధువులు దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టి, బలవంతంగా ఆమెతోనే పెళ్లి జరిపించారు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లా భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. జీవచ్ఛాపూర్‌కు చెందిన మిథిలేశ్ కుమార్ ముఖియా(24)కు, తన మేనమామ శివచంద్ర ముఖియా భార్య రీటా దేవితో అక్రమ సంబంధం ఉందని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జూలై 2న మిథిలేశ్‌ను కిడ్నాప్ చేసి శివచంద్ర ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ శివచంద్రతో పాటు మరికొందరు గ్రామస్థులు కలిసి మిథిలేశ్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అనంతరం రీటా దేవిని కూడా అక్కడికి తీసుకొచ్చి కొట్టారు. ఆ తర్వాత మిథిలేశ్ చేత బలవంతంగా ఆమె పాపిటలో సింధూరం పెట్టించి పెళ్లి జరిపించారు. అడ్డుకోబోయిన తమపైనా దాడి చేశారని మిథిలేశ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ దాడిలో మిథిలేశ్ వీపు, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు శివచంద్ర ముఖియాతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామని భీంపూర్ ఎస్‌హెచ్‌ఓ మిథిలేశ్ పాండే తెలిపారు. తీవ్రంగా గాయపడిన మిథిలేశ్‌ను మొదట నర్పత్‌గంజ్ ఆసుపత్రికి, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో అరారియా సదర్ ఆసుపత్రికి తరలించామని ఆయన వివరించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Affair with aunt
forced marriage
Mithilesh Kumar Mukhiya
Bihar crime
Supal district
Behimpura police station
Shivachandra Mukhiya
Rita Devi
kidnapping assault
honor crime

More Telugu News