Rishabh Pant: పంత్‌ను గిల్‌క్రిస్ట్‌తో పోల్చొద్దు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rishabh Pant Not Like Gilchrist Says Ashwin
  • గిల్‌క్రిస్ట్‌ కంటే పంత్‌కే మెరుగైన డిఫెన్స్ ఉందన్న అశ్విన్
  • పంత్‌ను అత్యుత్తమ బ్యాటర్లతో పోల్చాలన్న వెటరన్ స్పిన్నర్
  • అవసరమైనప్పుడు సంయమనం పాటించడం కూడా నేర్చుకోవాలని సూచన
టీమిండియా డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోల్చడంపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ పోలిక సరికాదని, గిల్‌క్రిస్ట్‌ కంటే పంత్‌కే మెరుగైన డిఫెన్స్ ఉందని స్పష్టం చేశారు. పంత్ తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉన్నాడని, అతనిని వేరే వారితో పోల్చడం తగదని అభిప్రాయపడ్డాడు.

తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. పంత్ ఆటతీరును విశ్లేషించాడు. "పంత్ ఒక అద్భుతమైన ఆటగాడు. చాలామంది అతడిని గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తుంటారు. కానీ అతడు గిల్‌క్రిస్ట్ కాదు. గిల్‌క్రిస్ట్‌కు అంత మంచి డిఫెన్స్ లేదు. పంత్‌కు మాత్రం అత్యున్నత స్థాయి డిఫెన్స్ ఉంది. అతడిని అత్యుత్తమ బ్యాటర్లతో పోల్చాలి కానీ గిల్‌క్రిస్ట్‌తో కాదు. పంత్ తనదైన శైలిలో ఆడగలడు" అని వివరించాడు.

అదే సమయంలో పంత్ తన ఆటతీరులో కొన్ని మార్పులు చేసుకోవాలని అశ్విన్ సూచించారు. "రిషభ్ పంత్ తన పూర్తి సామర్థ్యాన్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అతడు మనల్ని అలరించాలి, కానీ అవసరమైనప్పుడు సంయమనం కూడా పాటించాలి. పంత్ ఇప్పుడు కొత్త ఆటగాడేమీ కాదు. తన ప్రమాణాలకు తగ్గట్టుగా అతను ఆడాలి" అని అశ్విన్ పేర్కొన్నాడు.

టెస్టు క్రికెట్‌లో భారత జట్టుకు పంత్ కీలక ఆటగాడిగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 2000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. క్లిష్ట సమయాల్లో దూకుడుగా ఆడి, ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సామర్థ్యం పంత్‌కు ఉంది.
Rishabh Pant
Ravichandran Ashwin
Adam Gilchrist
India cricket
Indian cricket team
wicket keeper
cricket analysis
cricket comparison
Test cricket
cricket SENA countries

More Telugu News