Salt: మన వంటగదిలోని 'తెల్లటి విషం'.. ఉప్పు వాడకంపై షాకింగ్ నిజాలు

How Much Salt You Are Eating Per Day Know The Limits
  • రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తినాలని డబ్ల్యూహెచ్ఓ సూచన
  • భారతీయుల సగటు వాడకం రోజుకు 11 గ్రాములుగా వెల్లడి
  • సిఫార్సు కన్నా రెట్టింపు ఉప్పు వాడుతున్న వైనం
  • అధిక వాడకంతో గుండె, కిడ్నీ జబ్బుల తీవ్ర ప్రమాదం
  • 2030 నాటికి 90 లక్షల గుండెపోటు కేసులు రావొచ్చని అంచనా
వంటకాల్లో రుచికి ప్రాణమైన ఉప్పు వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా భారతీయులు సిఫార్సు చేసిన దానికంటే దాదాపు రెట్టింపు స్థాయిలో ఉప్పును తీసుకుంటున్నారని, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని తాజా నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు కేవలం 5 గ్రాముల (ఒక టీస్పూన్) ఉప్పు మాత్రమే తీసుకోవాలి. దీని ద్వారా శరీరానికి అవసరమైన 2 గ్రాముల సోడియం అందుతుంది. అయితే, ఇండియన్ హైపర్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం, మన దేశంలో సగటున ఒక వ్యక్తి రోజుకు 10.9 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారు. ఇది సిఫార్సు చేసిన పరిమితి కన్నా రెట్టింపు కావడం గమనార్హం. కేవలం భారత్‌లోనే కాకుండా చైనాలో 11 గ్రాములు, అమెరికాలో 8.5 గ్రాముల చొప్పున ప్రజలు ఉప్పును అధికంగానే వాడుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి.

అధిక సోడియం వల్ల హైబీపీ, గుండెపోటు, కిడ్నీ సమస్యలు, జీర్ణాశయ క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2021లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం రోజువారీ సోడియం వినియోగం కేవలం 1 గ్రాము పెరిగినా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2030 నాటికి సుమారు 90 లక్షల మంది గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కేవలం కూరల్లో నేరుగా వేసే ఉప్పే కాకుండా, మనం రోజూ తినే ఊరగాయలు, అప్పడాలు, చట్నీలు, చిప్స్, బ్రెడ్, బిస్కెట్లు, చీజ్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెస్టారెంట్ భోజనం ద్వారా తెలియకుండానే అధిక మోతాదులో ఉప్పు శరీరంలోకి చేరుతోంది. ఈ తరహా ఆహార పదార్థాల వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా ఉప్పు వినియోగాన్ని నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Salt
WHO
Salt intake
Sodium
Hypertension
Heart disease
Kidney problems
Indian Hypertension Management Initiative
High blood pressure
Osteoporosis

More Telugu News